Kuwait fire incident: కువైట్‌ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు

కువైట్ అగ్నిప్రమాదం (Kuwait fire incident)లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలు ఈ ఉదయం కేరళకు చేరుకున్నాయి. వాయుసేన విమానంలో వాటిని తరలించారు.   

Updated : 14 Jun 2024 11:48 IST

కొచ్చి: కువైట్‌లోని అల్‌ మంగాఫ్‌లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆ విమానం భారత్‌కు చేరుకుంటుందన్న సమాచారంతో బాధిత కుటుంబాలు ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్నంగా మారిపోయింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్రమంత్రి సురేశ్‌ గోపి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌తో పాటు పలువురు విమానాశ్రయంలో ఉన్నారు.(Kuwait fire incident)

కువైట్‌ మృతుల్లో ముగ్గురు ఏపీవాసులు

మృతదేహాలను తరలించేందుకు భారత వాయుసేన (IAF) గురువారం రాత్రి ఓ విమానాన్ని కువైట్‌ చేరుకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వం.. అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రమంత్రి కీర్తివర్ధన్‌ను అక్కడకు పంపింది. మృతుల్లో 23 మంది కేరళవాసులు కాగా.. ఏడుగురు తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు. ఏపీకి చెందినవారు ముగ్గురు. ఒక కర్ణాటక వ్యక్తి ఉన్నారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు. దాంతో కొచ్చి తర్వాత ఈ విమానం దిల్లీకి వెళ్లనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని