Prachand: వాయుసేన అమ్ములపొదిలో.. అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు (LCH) భారత వాయుసేన అమ్ములపొదికి చేరాయి.

Updated : 03 Oct 2022 16:01 IST

దిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’ (Prachand) భారత వాయుసేన అమ్ములపొదికి చేరింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీటిని లాంఛనంగా భారత వైమానిక దళంలోకి (Indian Air Force) ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మోహరింపు కోసం రూపొందించిన ‘ప్రచండ్‌’ హెలికాప్టర్లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL) అభివృద్ధి చేసింది.

భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచేందుకుగాను స్వదేశీ పరిజ్ఞానంతో తేలికపాటి హెలికాప్టర్లను (ఎల్‌సీహెచ్‌) సమకూర్చేందుకు 2020 మార్చిలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన భద్రతా కేబినెట్‌ కమిటీ (CCS) ఆమోద ముద్ర వేసింది. తొలుత 15 హెలికాప్టర్ల కోసం రూ.3887 కోట్లను కేటాయించింది. వీటిలో 10 హెలికాప్టర్లు భారత వాయుసేనలోకి, మరో ఐదింటిని ఆర్మీకి కేటాయించారు. నేడు జరిగిన కార్యక్రమంలో నాలుగు హెలికాప్టర్లను వాయుసేనలో ప్రవేశపెట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని ‘ప్రచండ్‌’ ఎల్‌సీహెచ్‌లను సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు భారత వాయుసేన అధికారులు వెల్లడించారు.

1999 కార్గిల్‌ యుద్ధం తర్వాత ఇటువంటి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో వీటిని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.

ప్రచండ్‌ ఎల్‌సీహెచ్‌లు అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్లైన ‘ధ్రువ్‌’ మాదిరిగానే ఉంటాయి.

రెండు ఇంజిన్లు కలిగిన ఈ తేలికపాటి హెలికాప్టర్‌ 5.8టన్నుల బరువు ఉంటుంది.

గాల్లో క్షిపణి లక్ష్యాలను టార్గెట్‌ చేసే విధంగా ఎయిర్‌-టు-ఎయిర్‌ గన్స్‌ ఈ హెలికాప్టర్‌కు ఉంటాయి.

20ఎంఎం టర్రెంట్‌ గన్స్‌, రాకెట్‌ వ్యవస్థతోపాటు ఇతర ఆయుధాలను విడిచే ఏర్పాట్లు ఉన్నాయి.

యుద్ధ ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు సహా ఎత్తైన పర్వత ప్రాంతాలతోపాటు రాత్రివేళల్లోనూ శత్రు లక్ష్యాలను ఇవి ఛేదిస్తాయి.

సముద్ర, ఎడారి ప్రాంతాలతోపాటు సియాచిన్‌ వంటి ప్రతికూల వాతావరణాల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్ల పనితీరును పరీక్షించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని