IAF: ఎన్నికల విధుల్లో వాయుసేన దూకుడు.. 1000 గంటలకుపైగా హెలికాప్టర్ల సేవలు

ఎన్నికలు సజావుగా సాగడంలో వాయుసేన కూడా కీలక పాత్ర పోషించిందని.. తమ హెలికాప్టర్లతో మొత్తంగా వెయ్యి గంటలకుపైగా సేవలందించామని భారత వాయుసేన వెల్లడించింది.

Published : 12 Jun 2024 20:12 IST

దిల్లీ: భారీ యంత్రాంగం, కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం విజయవంతంగా పూర్తిచేసింది. దేశంలో మారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఓటరు చెంతకు పోలింగ్‌ సామగ్రి, సిబ్బందిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఇలా ఎన్నికలు సజావుగా సాగడంలో భారత వాయుసేన కూడా కీలక పాత్ర పోషించింది. తమ హెలికాప్టర్లతో మొత్తంగా వెయ్యి గంటలకుపైగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ సేవలందించామని వాయుసేన వెల్లడించింది.

‘‘సార్వత్రిక ఎన్నికలు-2024 సమయంలో తేలికపాటి చేతక్‌, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్‌, ఎంఐ-17 మీడియం-లిఫ్ట్‌ వంటి హెలికాప్టర్లను విస్తృతంగా ఉపయోగించాం. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందితోపాటు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్లను (EVMs) తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాం. మారుమూల ప్రాంతాలతో పాటు రోడ్డు మార్గంలో భద్రతా సవాళ్లు ఉన్న ప్రదేశాలకూ సేవలు అందించాం. పోలింగ్‌కు ముందు కొన్ని గంటల్లోనే ఎన్నికల సిబ్బంది, సామగ్రిని తరలించాల్సి రావడం, పోలింగ్‌ ముగిసిన వెంటనే తిరిగి వాటిని తీసుకురావడం సవాలుతో కూడుకున్నది. మొత్తంగా తమ హెలికాప్టర్ల ద్వారా 1750 ప్రదేశాల్లో వెయ్యి గంటలకుపైగా సేవలందించాం’’ అని భారత వాయుసేన వెల్లడించింది.

జమ్మూకశ్మీర్‌ నుంచి తమిళనాడు వరకు, నాగాలాండ్‌ నుంచి గుజరాత్‌ వరకు.. దేశవ్యాప్తంగా ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించడంలో కీలక పాత్ర పోషించామని ఐఏఎఫ్‌ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయంతో విజయవంతంగా తమ విధులు నిర్వర్తించామని తెలిపింది. ఇండియన్‌ ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌ హెలికాప్టర్లను కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని