Published : 27 Jun 2022 19:38 IST

Agnipath: అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94వేల మంది దరఖాస్తు

దిల్లీ: త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారి కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నియామక ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద వాయుసేనలో నియామక ప్రక్రియ ప్రారంభం కాగా.. కేవలం నాలుగు రోజుల్లోనే 94వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ మేరకు రక్షణశాఖ అధికార ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు ట్విటర్‌లో వెల్లడించారు.

అగ్నిపథ్ కింద వాయుసేనలో నియామకాల కోసం గత శుక్రవారం(జూన్‌ 24) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10.30 గంటల నాటికి 94,281 మంది అభ్యర్థులు వాయుసేనలో అగ్నివీరుల నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు భరత్‌ భూషణ్‌ బాబు తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగియనుంది. ఆసక్తిగల అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్​ 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్ల పూర్తయ్యాక వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తారని పేర్కొంది. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలు చేపట్టకపోవడంతో తొలి ఏడాది అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. కాగా.. ఈ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అగ్నివీరులకు పలు ఆఫర్లను కూడా కేంద్రం ప్రకటించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్‌ నియామకాలతో పాటు రక్షణ శాఖ ఉద్యోగాల్లో అగ్నివీరులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించింది.

దరఖాస్తు ఇలా..

  • వాయుసేనలో అగ్నివీరులుగా చేరాలనుకునే వారు https://agnipathvayu.cdac.in/AV/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • తొలుత తమ వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్‌లో సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.
  • తర్వాత అప్లికేషన్‌ ఫీజును చెల్లించాలి. దరఖాస్తు పూర్తయ్యాక అప్లికేషన్‌ కాపీని భవిష్యత్‌ అవసరాల కోసం డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • జులై 24న నిర్వహించే పరీక్షకు అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉంటుంది.
  • ఇంటర్‌ లేదా/ 12వ తరగతిలో మేథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌ సబ్జెక్టులు చదివి ఉండి.. కనీసం 50 శాతం మార్కులు సాధించిన వారు దీనికి అర్హులు.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి 50 శాతం మార్కులు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అభ్యర్థులు మెడికల్‌ టెస్టుకు కూడా హాజరవ్వాల్సి ఉంటుంది.
Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని