AK-103 Assault Rifles: తాలిబన్​ ఎఫెక్ట్​.. 70వేల తుపాకులు కొంటున్న భారత్​!

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ప్రపంచంలోని పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. తాలిబన్లతో తమ దేశానికి ముప్పు వాటిళ్లకుండా తగిన జాగ్రత్తలు వహిస్తున్నాయి.....

Published : 29 Aug 2021 01:26 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ప్రపంచంలోని పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. తాలిబన్లతో తమ దేశానికి ముప్పు వాటిళ్లకుండా తగిన జాగ్రత్తలు వహిస్తున్నాయి. అమెరికా విడిచిపెట్టి వెళ్లిన ఆయుధ సామగ్రి తాలిబన్ల చేతికి చిక్కడంతో అత్యాధునిక ఆయుధాలతో తాలిబన్లు ఏం చేస్తారోనని ఆందోళన నెలకొంది. అదే సమయంలో వారి నుంచి ఇతర ఉగ్ర సంస్థలకు ఆ ఆయుధాలు చేతులు మారే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత వాయుసేన (ఐఏఎఫ్​) దేశ ఆయుధ సంపత్తిని పెంపొందించుకునే చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రష్యా నుంచి 70వేల ఏకే-103 రైఫిళ్లను అత్యవసరంగా కొనుగోలు చేసింది.

కొత్తగా కొనుగోలు చేసిన రైఫిళ్లు కొన్ని నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా ఉగ్రదాడులను నియంత్రించేందుకు భద్రతా బలగాలు మరింత శక్తిమంతమవుతాయి. 70వేల ఏకే-103 రైఫిళ్లను రష్యా నుంచి గతవారం అత్యవసరంగా కొనుగోలు చేశామని, ఈ కాంట్రాక్టు విలువ రూ. 300కోట్లు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కశ్మీర్​, శ్రీనగర్ వంటి సున్నిత ప్రాంతాలు, వాయుసేన స్థావరాల వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తొలుత వీటిని అందించనున్నట్లు పేర్కొన్నాయి.

ఈ ఏకే-103.. విధ్వంసకర ఏకే-47కు అప్‌గ్రేడెడ్​ వెర్షన్​. ఏకే-103ని భారత నేవీ ఇప్పటికే వినియోగిస్తోంది. కశ్మీర్​ లోయలోని వూలర్​ లేక్​ వద్ద గస్తీ కాస్తున్న సిబ్బంది వద్ద కూడా ఈ రైఫిళ్లు ఉన్నాయి. మొత్తంమీద ఐఏఎఫ్​కు 1.5లక్షల తుపాకుల అవసరం ఉండగా.. అయితే మిగతా వాటిని అత్యాధునిక ఏకే-203 తుపాకులతో భర్తీ చేయనుంది. చైనాతో సరిహద్దు వివాదం తలెత్తినప్పటి నుంచి ఆయుధాల కొనుగోళ్లల్లో జోరు పెంచింది భారత్​.. ఆయుధ సంపత్తిని ఆధునికీకరించడంపై శ్రద్ధ వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని