BrahMos: యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి.. బ్రహ్మోస్‌ ప్రయోగం విజయవంతం

భారత రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి. యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగాన్ని భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగంతో సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని వాయుసేన సాధించగలిగింది.

Published : 29 Dec 2022 18:23 IST

దిల్లీ: భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని పెంచే మరో కీలక ప్రయోగం విజయవంతమైంది. బ్రహ్మోస్‌ (BrahMos )సూపర్‌ సోనిక్ క్రూయిజ్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వెర్షన్‌ను గురువారం సుఖోయ్‌-30ఎంకేఐ (Su-30 MKI) యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ యుద్ధ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి నిర్దేశిత దూరంలోని నౌకను పేల్చేసింది. ‘‘భారత వాయుసేన సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి.. బంగాళాఖాతం ప్రాంతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని నేరుగా తాకింది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భూతల/సముద్రంలోని సుదూర లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యాన్ని వాయుసేన సాధించింది’’ అని రక్షణశాఖ (Defence Ministry) ఓ ప్రకటనలో వెల్లడించింది.

బ్రహ్మోస్‌ (BrahMos)  ఎక్సటెండెడ్‌ రేంజ్‌ సామర్థ్యం, సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం సమర్థమైన పనితీరు..  భారత వైమానిక దళాని(ఐఏఎఫ్‌)కి ఒక వ్యూహాత్మక బలాన్ని అందించనున్నాయని రక్షణశాఖ తెలిపింది. భవిష్యత్తులో యుద్ధ క్షేత్రాలలో భారత్‌ ఆధిపత్యం చలాయించడానికి ఇవి దోహదపడుతాయని తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన క్లిప్పింగ్‌ను భారత వాయుసేన (IAF) ట్విటర్‌లో పంచుకుంది. వాయుసేన, భారత నేవీ (Indian Navy), డీఆర్‌డీవో (DRDO), హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (HAL), బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ (BAPL) సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రయోగం విజయవంతమైందని ఐఏఎఫ్‌ తెలిపింది.

కాగా.. యుద్ధ విమానం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ ఈ తరహా పరీక్ష చేపట్టారు. భారత్‌, రష్యాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ ద్వారా ఈ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ధ్వని కంటే దాదాపు మూడు రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లగలవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు