Airforce Day: వాయుసేన యుద్ధ సంసిద్ధతకు నిదర్శనమదే: వీఆర్‌ చౌదరి

గతేడాది తూర్పు లద్దాఖ్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలకు ప్రతిస్పందనగా తీసుకున్న సత్వర చర్యలే భారత వైమానిక దళం యుద్ధ సంసిద్దతకు నిదర్శనమని ......

Published : 08 Oct 2021 22:45 IST

దిల్లీ: గతేడాది తూర్పు లద్దాఖ్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలకు ప్రతిస్పందనగా తీసుకున్న సత్వర చర్యలే భారత వైమానిక దళం యుద్ధ సంసిద్దతకు నిదర్శనమని వాయుసేనాధిపతి వీఆర్‌ చౌదరి అన్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు విదేశీ శక్తులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పారు. 89వ భారత వైమానిక దినోత్సవం సందర్భంగా దిల్లీ శివారులోని హిండన్‌ ఎయిర్‌బేస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వాయుసేనలో ట్రెయినింగ్‌ మాడ్యూల్స్‌ని అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అలాగే, కింది ఉద్యోగులను, యువ అధికారులను ప్రోత్సహించి, వారు సాధికారత కోసం సీనియర్‌ అధికారులు తమ సమయం, కృషిని పెట్టుబడిగా పెట్టాలని కోరారు. దీన్ని తమ ప్రథమ కర్తవ్యంగా భావించి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

‘‘ఏడాది కాలంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను భారత్‌ దీటుగా ఎదుర్కొంది. లద్దాఖ్‌లో చైనాను భారత బలగాలు ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడమే లక్ష్యంగా మరింతగా అప్రమత్తతో పనిచేద్దాం. భారత భూభాగంలోకి బయటి శక్తులను అనుమతించబోమని దేశానికి చాటిచెప్పాలి. భారత వైమానిక దళానికి స్పష్టమైన దిశా నిర్దేశం, మెరుగైన నాయకత్వం, ఉత్తమ వనరులను అందించేందుకు నేను చేయగలిగిందంతా చేస్తానని మాట ఇస్తున్నాను.  తూర్పు లద్దాఖ్‌లో పరిణామాలకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం తీసుకున్న సత్వర చర్యలు మన యుద్ధ సంసిద్దతకు నిదర్శనం. కొవిడ్‌ సంబంధిత పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు దేశ ప్రయోజనాలను నెరవేర్చడంలో గొప్ప విజయం సాధించాం. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడటం మన పవిత్ర కర్తవ్యమని గుర్తు పెట్టుకోవాలి’’ అని వీఆర్‌ చౌదరి సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణె, త్రివిధ దళాల, రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గతేడాది జూన్‌ మధ్య కాలంలో తూర్పు లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల సమయంలో వాయుసేన అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. దాదాపు అన్ని ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ జెట్‌లను మోహరించింది. సుఖోయ్‌ 30 ఎంకేఐ, జాగ్వార్‌, మిరాగ్‌ 2000 వంటి ఫైటర్‌ జెట్‌లను తూర్పు లద్దాఖ్‌తో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి శత్రు సేనల కుట్రలను చిత్తుచేసేందుకు సిద్ధంగా ఉంచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని