Gujarat: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టి.. చిక్కుల్లో ఐఏఎస్‌ అధికారి

గుజరాత్‌ ఎన్నికలకు పరిశీలకుడిగా నియమితులైన ఓ ఐఏఎస్‌ అధికారి ఆ విషయాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈసీ ఆయనపై చర్యలు చేపట్టింది.

Updated : 18 Nov 2022 15:42 IST

గాంధీనగర్‌: తన విధులకు సంబంధించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టి ఇబ్బందుల్లో పడ్డారో ఐఏఎస్‌ అధికారి. ఆ పోస్ట్‌ కారణంగా ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌ను ఈసీ.. గుజరాత్‌ ఎన్నికలకు పరిశీలకుడిగా నియమించింది. అహ్మదాబాద్‌లో బాపునగర్‌, అసర్వా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన జనరల్‌ అబ్జర్వర్‌గా వెళ్లారు. అయితే, ఈ విషయాన్ని తెలియజేస్తూ అభిషేక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో పాటు, అధికారిక వాహనం పక్కన నిల్చున్న ఫొటో, తన బృందంతో కలిసి ఉన్న రెండు ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇది కాస్తా ఎన్నికల సంఘం దృష్టికి చేరడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ అభిషేక్‌పై చర్యలు చేపట్టింది. ‘‘ఆ ఐఏఎస్‌ అధికారి ఇన్‌స్టా పోస్ట్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారిక హోదాను ఆయన పబ్లిసిటీ స్టంట్‌గా ఉపయోగించుకున్నారు. ఆయనను తక్షణమే అబ్జర్వర్‌ విధుల నుంచి తొలగిస్తున్నాం’’ అని ఈసీ వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేగాక, తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎన్నికల సంబంధిత విధుల్లోకి తీసుకోకుండా అభిషేక్‌ను డీబార్‌ చేసినట్లు తెలుస్తోంది. తక్షణమే నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశించిందట. అబ్జర్వర్‌గా ఆయనకు కేటాయించిన ప్రభుత్వ సదుపాయాలను కూడా తొలగించినట్లు సమాచారం. అభిషేక్‌ స్థానంలో మరో ఐఏఎస్‌ అధికారిని నియమించినట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు