Vaccine Effectiveness: అధ్యయనానికి ఐసీఎంఆర్‌ సిద్ధం!

దేశంలో విస్తృతంగా పంపిణీ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ల ప్రభావశీలత తెలుసుకునేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సిద్ధమైంది.

Published : 27 May 2021 00:22 IST

3 నుంచి 5వేల మంది సమాచారం విశ్లేషణకు ఏర్పాట్లు

దిల్లీ: దేశంలో విస్తృతంగా పంపిణీ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ల ప్రభావశీలత తెలుసుకునేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సిద్ధమైంది. ఇందుకోసం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు తీసుకున్న 3 నుంచి 5వేల మంది సమాచారాన్ని విశ్లేషించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ప్రయోగ ఫలితాల ఆధారంగానే వీటి సామర్థ్యాన్ని అంచనా వేయగా.. ప్రస్తుతం వ్యాక్సిన్‌ పొందిన వారి వాస్తవ సమాచారాన్ని బట్టి వాటి ప్రభావాలను అంచనా వేయనున్నారు. జూన్‌ మొదటి వారంలో ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

జనవరి 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ భారత్‌లో ముమ్మరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 20కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్‌లు అనుమతి పొందగా కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు ఇక్కడే తయారవుతున్నాయి. అయితే, ఈ వ్యాక్సిన్ల ప్రభావశీలతను అంచనా వేసేందుకు ఐసీఎంఆర్‌ నడుం బిగించింది. ఇందుకోసం 3 నుంచి 5వేల మంది సమాచారాన్ని విశ్లేషించనుంది. వీరిలో 80శాతం మంది సీరం తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ తీసుకున్న వారు కాగా మరో 20 శాతం మంది కొవాగ్జిన్‌ తీసుకున్న వారు ఉండనున్నారు.

వైరస్‌ వల్ల కలిగే తీవ్ర ప్రభావాలను వ్యాక్సిన్‌లు ఎదుర్కొంటాయో? లేదో తెలుసుకునే లక్ష్యంతోనే వీటిని చేపడుతున్నట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడమాలజీ (NIE) శాస్త్రవేత్త తరుణ్‌ భట్నాగర్‌ మీడియాకు వెల్లడించారు. వీటితో పాటు ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్‌) తొలి డోసు, రెండు డోసులు తీసుకున్న తర్వాత వచ్చే ప్రభావాలను పోల్చి చూడనున్నారు. భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లుగా భావిస్తోన్న B.1.617 రకంపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత 60శాతం సామర్థాన్ని కనబరిచినట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ  ఈ మధ్యే వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ కొత్త రకాలపై వ్యాక్సిన్‌ల ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్‌ తాజా అధ్యయనాన్ని చేపట్టనుంది.

ఇదిలాఉంటే, భారత్‌లో ఇప్పటివరకు 20కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా.. అందులో సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోన్న కొవిషీల్డ్‌ డోసులే ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా రకాలపై కొవాగ్జిన్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇదివరకే ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని