ICMR Alert: మధుమేహం అలర్ట్‌.. భారత్‌లో 150శాతం పెరిగిన కేసులు!

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోన్న వేళ.. టైప్‌-1 మధుమేహంపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రజలను అప్రమత్తం చేసింది.

Published : 08 Jun 2022 01:58 IST

మార్గదర్శకాలు జారీచేసిన ఐసీఎంఆర్‌

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోన్న వేళ.. టైప్‌-1 మధుమేహంపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మధుమేహ బాధితులపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపించిందని వెల్లడించిన ఐసీఎంఆర్‌.. తీవ్ర వ్యాధి బారినపడడం, మరణాల రేటు వారిలోనే ఎక్కువగా ఉందని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో మధుమేహం బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలతోపాటు వ్యాధి నియంత్రణకు అనుసరించాల్సిన చర్యలపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

‘ప్రపంచంలో అత్యధిక మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. ప్రతి ఆరుగురు మధుమేహుల్లో ఒకరు భారతీయులే. గడిచిన మూడు దశాబ్దాల్లో దేశంలో మధుమేహం కేసుల సంఖ్య 150శాతం పెరిగింది’ అని ఐసీఎంఆర్‌ పేర్కొంది. టైప్‌-2 మధుమేహం కనిపించే వయసు క్రమంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్న ఐసీఎంఆర్‌.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారిలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది.

ఏమిటీ టైప్‌-1 మధుమేహం..?

ఇన్సులిన్‌ హార్మోన్‌ను క్లోమగ్రంథి తయారు చేయకపోవటం వల్ల తలెత్తే సమస్యే టైప్‌ 1 మధుమేహం. చాలావరకు ఇది చిన్న వయసులోనే దాడిచేస్తుంది. పెద్దవారిలో రావటం అరుదు. పదేళ్లలోపే మధుమేహం దాడి చేసినట్టయితే అది టైప్‌ 1 కోవకు చెందిందే. 10-35 ఏళ్ల వయసువారిలో దాదాపు సగం మందికి టైప్‌ 1 మధుమేహం వచ్చే అవకాశముంది. ఇలాంటి మధుమేహానికి ఇన్సులిన్‌ తీసుకోవటం తప్పించి మరో మార్గం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 11లక్షల మంది పిల్లలు (20ఏళ్ల కంటే తక్కువ వయసు) టైప్‌ 1 మధుమేహం బారినపడుతున్నారు. కుటుంబ సభ్యులకు ఉన్నట్లయితే వారి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, తల్లి వల్ల మూడుశాతం, తండ్రివల్ల ఐదు శాతం, సోదరుల వల్ల 8శాతం మాత్రమే పిల్లలకు వచ్చే ముప్పు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం..

* ప్రపంచంలో అత్యధిక మధుమేహ బాధితులు ఉన్న దేశాల్లో భారత్‌ది రెండో స్థానం

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురు మధుమేహుల్లో ఒకరు భారతీయులే.

2019లో మధుమేహం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 40లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు

భారత్‌లో గడిచిన మూడు దశాబ్దాల్లో మధుమేహం కేసుల సంఖ్యలో 150శాతం వృద్ధి కనిపిస్తోంది

అన్ని వయసుల వారికి దీని ముప్పు ఉన్నప్పటికీ అత్యధికంగా 10 నుంచి 14ఏళ్ల పిల్లల్లోనే ఎక్కువగా బయటపడుతోంది

ప్రతి లక్ష జనాభాలో 4.9కేసుల్లో టైప్‌ 1 మధుమేహమే కనిపిస్తోంది

టైప్‌ 1 మధుమేహం బారినపడిన వారు జీవితాంతం ఇన్సులిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది

ఇన్సులిన్‌ తీసుకోవడంలోనూ తగు జాగ్రత్తలు పాటించాలి

ప్రతిఒక్కరూ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలనూ కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి

25 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న వారిలో టైప్‌-2 మధుమేహ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది

మధుమేహాన్ని నియంత్రించడంలో జీవనశైలి మార్పులు ఎంతో కీలకం

ఆహారాన్ని సమతూకంలో తీసుకోవడం, శారీరక శ్రమ పెంచడం వల్ల స్థూలకాయాన్ని నివారించవచ్చని ఐసీఎంఆర్‌ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని