Agnipath: ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే.. ఆర్మీలో ప్రవేశం లేనట్లే..!

మిలటరీ నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ (Agnipath)కు దరఖాస్తు చేసుకునేవారు గతంలో నిరసనలు, హింసాత్మక ఘటనల్లో ఎన్నడూ పాల్గొనలేదనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుందని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.

Published : 19 Jun 2022 19:34 IST

ఆందోళనల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞా పత్రం సమర్పించాలన్న సైనికాధికారులు

దిల్లీ: మిలటరీ నియామకాల కోసం కొత్తగా ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ (Agnipath)కు దరఖాస్తు చేసుకునేవారు గతంలో నిరసనలు, హింసాత్మక ఘటనల్లో ఎన్నడూ పాల్గొనలేదనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుందని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు సమయంలోనే ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పోలీస్‌ వెరిఫికేషన్‌లో తేలితే అటువంటి వారికి అగ్నివీరులుగా ప్రవేశం పొందేందుకు ఆస్కారం ఉండదని తేల్చి చెప్పారు. అగ్నిపథ్‌ పథకం 1989 నుంచి పెండింగ్‌లో ఉందని.. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఎఫ్‌ఐఆర్‌ ఉంటే ఎంట్రీ లేదు..

అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ.. ఎన్నడూ ఎలాంటి ఆందోళనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతిఒక్క అభ్యర్థి ప్రతిజ్ఞ చేయాలని స్పష్టం చేశారు. అగ్నివీరులుగా (Agniveer) ఎంపికయ్యే సమయానికి పోలీసు వెరిఫికేషన్‌ జరుగుతుందని వెల్లడించారు.

‘తాజాగా ప్రవేశపెట్టిన పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను మేం ఊహించలేదు. క్రమశిక్షణే భారత సైన్యానికి పునాది. అటువంటి సైన్యంలో దాడులు, దహనాల వంటి క్రమశిక్షణారాహిత్యానికి చోటులేదు. ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనలేదని ప్రతి అభ్యర్థి ప్రమాణపత్రం సమర్పించాలి. పోలీస్‌ వెరిఫికేషన్‌లో ఏ అభ్యర్థి మీదైనా ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు తేలినా అగ్నివీరులుగా వారికి ప్రవేశం లేదు’ అని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

సైన్యం అంటేనే భావోద్వేగం

భారత సైన్యంలో ఉద్యోగం అంటేనే భావోద్వేగంతో కూడుకున్నదని.. అటువంటి వాటిని జీతంతో లెక్కకట్టలేమని లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రెగ్యులర్‌ సైనికుల మాదిరిగానే అగ్నివీరులకు భత్యం ఉంటుందన్న ఆయన.. సర్వీస్‌ నిబంధనల్లో ఎటువంటి వ్యత్యాసం ఉండదన్నారు. నేవీలో అగ్నివీరులుగా మహిళలను కూడా నియమించుకుంటామని వైస్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి వెల్లడించారు. నవంబర్‌ 21 నుంచి నేవీలో అగ్నివీరుల శిక్షణ మొదలవుతుందని తెలిపారు. ఇక వాయుసేనలో డిసెంబర్‌ 30 నుంచి అగ్నివీరుల తొలి బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభమవుతుందని ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌కే ఝా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని