G7: ‘అలా చేస్తే సంక్షోభం మరింత తీవ్రతరం’.. భారత్‌ నిర్ణయాన్ని ఖండించిన జీ7 మంత్రులు

భారత్‌ నుంచి గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడాన్ని జీ-7 దేశాల వ్యవసాయ మంత్రులు ఖండించారు. ‘ప్రతి ఒక్కరూ ఎగుమతులపై ఆంక్షలు విధించడం లేదా మార్కెట్లను మూసివేయడం ప్రారంభిస్తే.. అది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం...

Updated : 15 May 2022 06:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ నుంచి గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడాన్ని జీ-7 దేశాల వ్యవసాయ మంత్రులు ఖండించారు. ‘ప్రతి ఒక్కరూ ఎగుమతులపై ఆంక్షలు విధించడం లేదా మార్కెట్లను మూసివేయడం ప్రారంభిస్తే.. అది సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది’ అని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్దెమిర్ అన్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార భదత్రపై ప్రభావం పడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీ7 దేశాల ప్రతినిధులు శనివారం జర్మనీలో భేటీ అయ్యారు. ‘దాదాపు 20 మిలియన్ టన్నుల గోధుమలు ఉక్రెయిన్‌ క్షేత్రాల్లో నిల్వ ఉన్నాయి. వాటిని అత్యవసరంగా ఎగుమతి చేయాల్సిన అవసరం ఉంది’ అని ఓజ్దెమిర్ అన్నారు.

రష్యా సైనిక చర్యకు ముందు.. ఉక్రెయిన్ తన నౌకాశ్రయాల ద్వారా నెలకు 4.5 మిలియన్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. కానీ.. ఒడెస్సా, చోర్నోమోర్స్క్ తదితర పోర్ట్‌లను రష్యా నిర్బంధించడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా.. మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచే చర్యలు తీసుకోవద్దని జీ7 దేశాల మంత్రులు కోరారు. ఎగుమతులపై నిషేధం తగదని, మార్కెట్‌లను తెరిచి ఉంచాలని పిలుపునిచ్చారు. జీ-20 సభ్యదేశంగా భారత్‌ తన బాధ్యతను నిర్వర్తించాలని ఓజ్దెమిర్ విజ్ఞప్తి చేశారు. అయితే.. ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ ఆధారంగా మే 13 నాటికి చేసుకున్న ఒప్పందాల మేరకు ఎగుమతులు కొనసాగుతాయని భారత్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇతర దేశాల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఎగుమతులను అనుమతించింది. అయితే, దీనికి సర్కారు అనుమతి తప్పనిసరని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని