Vaccine: భారత్‌ ఓకే అంటే వెంటనే పంపుతాం

వీలైనంత వేగంగా భారత్‌కు కొవిడ్‌ టీకాలను అందజేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రితినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. అయితే, టీకాలు స్వీకరించడానికి భారత్‌ ఇంకా పచ్చజెండా ఊపాల్సి ఉందన్నారు. టీకా విరాళాలను స్వీకరించే....

Updated : 14 Jul 2021 11:09 IST

అమెరికా విదేశాంగశాఖ ప్రకటన

వాషింగ్టన్‌: వీలైనంత వేగంగా భారత్‌కు కొవిడ్‌ టీకాలను అందజేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. అయితే, టీకాలు స్వీకరించడానికి భారత్‌ ఇంకా పచ్చజెండా ఊపాల్సి ఉందన్నారు. టీకా విరాళాలను స్వీకరించే విషయంలో చట్టపరమైన అంశాలను భారత్‌ సమీక్షిస్తోందని తెలిపారు. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని ఇండియా తెలిపినట్లు పేర్కొన్నారు.

ముందు జాగ్రత్తగా అమెరికా భారీ ఎత్తున కరోనా టీకా డోసుల్ని నిల్వ చేసి పెట్టుకుంది. వీటిలో 80 మిలియన్‌ డోసుల్ని వివిధ దేశాలకు పంపిణీ చేసేందుకు అధ్యక్షుడు బైడెన్ అంగీకారం తెలిపారు. ఇప్పటికే నేపాల్‌, పాకిస్థాన్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలకు 40 మిలియన్‌ డోసుల టీకాలు చేరాయి. కానీ, భారత్‌లో మాత్రం టీకా విరాళాలను స్వీకరించే విషయంలో ఉన్న అడ్డంకుల్ని ఇంకా పరిష్కరించాల్సి ఉంది. దీంతో అమెరికా టీకాలు అందడంలో ఆలస్యమవుతోంది.

భారత్‌లో ఫార్మా రంగం చాలా బలంగా ఉందని ప్రైస్‌ తెలిపారు. వ్యాక్సిన్లు, ఔషధాల తయారీలో భారత్‌కు ఉన్న సామర్థ్యం ప్రపంచ దేశాలకు లబ్ధి చేకూరుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌-అమెరికా మధ్య వైద్యారోగ్యం, బయోటెక్ రంగాల్లో ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిని మరింత విస్తృతం చేసేలా త్వరలో ఇరు దేశాల మధ్య ‘అవగాహన ఒప్పందం(ఎంఓయూ)’ కుదిరే అవకాశం ఉందన్నారు. ఆ మధ్య జరిగిన క్వాడ్‌ సదస్సులో.. వ్యాక్సిన్ల ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేలా భారత్‌కు ఆర్థిక సహకారం అందించేందుకు సభ్యదేశాలు అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రైస్‌ గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని