Kejriwal: పిజ్జా డెలివరీ చేసినప్పుడు రేషన్‌ చేయలేమా?

దిల్లీలో రేషన్ డోర్‌ డెలివరీని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని శుక్రవారం ఆరోపించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్.. మోదీ సర్కార్‌పై నేడు స్వరం మరింత పెంచారు. రేషన్‌ మాఫియాకు తలొగ్గే కేంద్రం రేషన్‌ డోర్‌ డెలివరీ......

Updated : 06 Jun 2021 15:01 IST

దిల్లీ: దిల్లీలో రేషన్ డోర్‌ డెలివరీని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని శుక్రవారం ఆరోపించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్.. మోదీ సర్కార్‌పై నేడు స్వరం మరింత పెంచారు. రేషన్‌ మాఫియాకు తలొగ్గే కేంద్రం రేషన్‌ డోర్‌ డెలివరీకి మోకాలడ్డుతోందని ఆరోపించారు. మహమ్మారి సమయంలో పిజ్జా డెలివరీకి అనుమతించినప్పుడు రేషన్‌ను ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు. రేషన్‌ మాఫియాకు చెక్‌ పెట్టాలని దిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కేంద్రం అడ్డుపడుతోందన్నారు. దీన్ని బట్టి దిల్లీలోని రేషన్‌ మాఫియా ఎంత శక్తిమంతమైందో తెలుస్తోందన్నారు. కేవలం కొన్ని వారాల్లోనే పథకాన్ని నిలిపివేయించే స్థాయిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదన్న కేంద్ర సర్కార్‌ వాదనను కేజ్రీవాల్‌ తోసిపుచ్చారు. ఐదుసార్లు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని తెలిపారు. చట్టపరంగా చూస్తే అసలు కేంద్రం ఆమోదం అవసరమే లేదని వ్యాఖ్యానించారు. ‘‘రేషన్‌ డోర్‌ డెలివరీ పథకాన్ని అమలు చేసేందుకు అనుమతించండి. ఆ క్రెడిట్‌ మొత్తం మీకే(ప్రధాని మోదీ) ఇస్తాను. రేషన్‌ ఆప్‌కో లేక భాజపాకో చెందింది కాదు. మోదీ, కేజ్రీవాల్‌ ఇద్దరూ కలిసి రేషన్‌ అందిస్తున్నారని ప్రజలు భావిస్తారు. 70 లక్షల మంది లబ్ధిదారుల తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నా.. పథకాన్ని అమలు చేసేందుకు అనుమతించండి’’ అని కేజ్రీవాల్‌ అన్నారు. 

ఒకట్రెండు రోజుల్లో ఈ పథకం ప్రారంభించే యోచనతో ఆప్‌ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రెండు కారణాల రీత్యా తక్షణమే ఆమోదించలేమంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) ఫైలును వెనక్కి పంపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపకపోవడం ఒక కారణం కాగా.. కోర్టులో కేసు ఉండటం మరో కారణం. మరోవైపు కేంద్రం కావాలనే మోకాలు అడ్డుపెడుతోందని ఆప్‌ నేతలు మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని