Rakesh Tikait: ‘ఇక పంటలను అమ్ముకునేందుకు పార్లమెంట్‌కు వెళ్తాం’

కొత్త సాగు చట్టాల రద్దు కోసం టిక్రీ, ఘాజీపుర్‌ సరిహద్దుల్లో బైఠాయించి ఉద్యమిస్తున్న రైతులను కట్టడి చేసేందుకు దిల్లీ పోలీసులు గతంలో రోడ్లపై భారీ ఎత్తున బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటి తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు...

Published : 29 Oct 2021 20:20 IST

దిల్లీ: కొత్త సాగు చట్టాల రద్దు కోసం టిక్రీ, ఘాజీపుర్‌ సరిహద్దుల్లో బైఠాయించి ఉద్యమిస్తున్న రైతులను కట్టడి చేసేందుకు దిల్లీ పోలీసులు గతంలో రోడ్లపై భారీ ఎత్తున బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటి తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ విషయంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ శుక్రవారం స్పందిస్తూ.. రైతులు ఇక తమ పంటలను విక్రయించేందుకు పార్లమెంట్‌కు వెళ్తారని చెప్పారు.

‘మేం దిల్లీకి వెళ్లాలని గత 11 నెలలుగా ఇక్కడ కూర్చున్నాం. మమ్మల్ని అనుమతించలేదు. ఇప్పుడు రాకపోకలు ప్రారంభిస్తే అక్కడికి వెళ్తాం. రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు కదా! స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయని పంటను ఇప్పుడు ఎక్కడ విక్రయించాలో రైతులకు చెబుతాం. ముందుగా మా ట్రాక్టర్లు దిల్లీకి వెళ్తాయి’ అని రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. సరిహద్దుల్లో బారికేడ్లను తొలగిస్తున్న నేపథ్యంలో.. నిరసన కార్యక్రమాల విషయమై సంయుక్త కిసాన్‌ మోర్చా త్వరలోనే తన భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడిస్తుందని టికాయిత్‌ చెప్పారు. తదనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. రైతులకు నిరసన తెలిపే హక్కు ఉందని, కానీ, రహదారులను నిరవధికంగా దిగ్బంధించలేమని సుప్రీం కోర్టు ఇటీవల ఓ విచారణ సందర్భంగా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు తాజా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని