ట్రంప్‌ ఖాతానే నిషేధించారంటే..ఆలోచించాల్సిందే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను నిషేదించడంపై ఆ దేశంలో మెజారిటీ వర్గం హర్షిస్తుంటే.. భారత్‌లో మాత్రం భిన్నస్వరం వినిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద, బలమైన ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను..........

Published : 09 Jan 2021 16:45 IST

ట్విటర్‌ చర్యపై భారత్‌లో భిన్నస్వరం

దిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతాను నిషేదించడంపై ఆ దేశంలో మెజారిటీ వర్గం హర్షిస్తుంటే.. భారత్‌లో మాత్రం భిన్నస్వరం వినిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద, బలమైన ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను నిషేధించడాన్ని తప్పుబడుతున్నారు. బడా సాంకేతక కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇదొక హెచ్చరిక వంటిదని భాజపా ఎంపీ తేజస్వీ సూర్య పేర్కొన్నారు. నియంత్రణ లేని బడా సాంకేతిక కంపెనీల వల్ల పొంచి ఉన్న ముప్పును ఈ ఘటన సూచిస్తోందని తెలిపారు. భారత్‌లో ఈ తరహా ఘటనలు జరగకుండా నిబంధనల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడి ఖాతానే నిషేధించినప్పుడు ఇక ఎవరి ఖాతాలనైనా రద్దు చేయగలరని వ్యాఖ్యానించారు. దేశంలో ఐటీ విధానంలో మార్పులు సూచిస్తూ లోక్‌సభలో ఆయన చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా ట్విటర్‌లో ఉంచారు.

భాజపా సామాజిక మాధ్యమ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్‌ ఖాతాను తొలగించడం ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేవారిపై పెరుగుతున్న అసహనాన్ని ఇది సూచిస్తోందని అభిప్రాయపడ్డారు. వాక్‌ స్వాతంత్ర్యానికి వేదికలుగా చెప్పుకుంటున్న వారే ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదంటూ పరోక్షంగా ట్విటర్‌పై విమర్శలు చేశారు. బడా సాంకేతిక కంపెనీలు ఇప్పుడు ఆధిపత్యం చెలాయించే వర్గాలుగా మారతున్నాయని వ్యాఖ్యానించారు. ఇటీవల దిల్లీలో రైతుల ఆందోళనను ఉద్దేశిస్తూ అమిత్‌ మాలవీయ చేసిన ట్వీట్‌కు ‘అభ్యంతరకర విషయం’గా పేర్కొంటూ ట్విటర్‌ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం.

శివసేనకు చెందిన ప్రముఖ మహిళా నేత, రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది సైతం ట్విటర్‌ చర్యను తప్పుబట్టారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ట్రంప్‌ తనని తాను బలవంతుడిగా మార్చుకునేందుకు సహకరించిన ట్విటర్‌ ఇప్పుడు ఇలా నిషేధం విధించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం కోల్పోతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని గుర్తుచేశారు. ఏళ్లుగా ద్వేషపూరిత భావాల్ని ప్రోత్సహించిన బడా కంపెనీ.. ఈ చర్యతో పవిత్రంగా మారిపోలేదంటూ ఎద్దేవా చేశారు. ఆయా దేశాల మార్గదర్శకాలకు కట్టుబడి సామాజిక మాధ్యమాలు తమ నిబంధనల్ని రూపొందించుకోవాల్సిన అసవరం ఉందన్నారు.

ఇవీ చదవండి..

ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వత నిషేధం!

ప్రమాణస్వీకారానికి ట్రంప్‌ రాకపోవడమే మంచిది



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని