Coronavirus: హిమాలయాల్లోని మొక్కలో కరోనాను నిరోధించే శక్తి..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ను నిరోధించే ఫైటోకెమికల్స్​ కలిగిన ఓ మొక్కను హిమాలయాల్లో గుర్తించారు.......

Published : 18 Jan 2022 01:50 IST

గుర్తించిన ఐఐటీ మండీ, ఐసీజీఈబీ పరిశోధకులు

దిల్లీ: హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, చాలా రోగాలను నయం చేసే ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని కొందరు చెబుతుంటారు. ఇప్పుడు ఆ మాట నిజమని కొందరు శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​ను నిరోధించే ఫైటోకెమికల్స్​ కలిగిన మొక్కను హిమాలయాల్లో గుర్తించారు.

హిమాచల్​ప్రదేశ్​లోని మండీ ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ), దిల్లీలోని ఇంటర్నేషనల్​ సెంటర్​ ఫర్​ జెనెటిక్​ ఇంజినీరింగ్​ అండ్​ బయో టెక్నాలజీ (ఐసీజీఈబీ) సంయుక్తంగా ఈ పరిశోధనలు నిర్వహించాయి. హిమాలయాల్లోని ‘రోడోడెండ్రాన్​ అర్బోరియం’ అనే మొక్క పూరేకుల్లో కొవిడ్​-19 చికిత్సలో కీలకమైన ఫైటోకెమికల్స్​ను పరిశోధకులు గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా ‘బురాన్ష్​’గా పిలుస్తారని తెలిపారు. ఈ ఫైటోకెమికల్స్​ వైరస్​కు వ్యతిరేకంగా పోరాడతాయి. కాగా ‘బయోమాలిక్యులార్​ స్ట్రక్చర్​ అండ్​ డైనమిక్స్​’ జర్నల్​లో ఇటీవలే ఈ అధ్యయనం ప్రచురితమైంది.

ఐఐటీ మండీ అసోసియేట్​ ప్రొఫెసర్ శ్యామ్​కుమార్​ మసకపల్లి ఈ సందర్భంగా మాట్లాడారు​. ‘వైరస్​పై శరీరానికి పోరాడే శక్తిని ఇచ్చే పద్ధతుల్లో వ్యాక్సిన్​ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా టీకాయేతర ఔషధాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా ఔషధాల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరీర కణాల్లోని గ్రహకాలను బంధిస్తాయి. వైరస్​ ప్రవేశించకుండా నిరోధిస్తాయి. అలాగే.. శరీరంలో వైరస్​ ప్రవేశించినా వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. వివిధ రకాల చికిత్సలపై అధ్యయనం చేశాక, మొక్కల నుంచి తీసుకున్న రసాయనాలు  ఫైటోకెమికల్స్​.. వైరస్​ను నిరోధించటంలో కీలకంగా మారుతున్నాయని తెలిసింది’ అని పేర్కొన్నారు.

హిమాలయాల్లో దొరికే బురాన్ష్​ మొక్కల పూరేకులను స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రకాల చికత్సల్లో వినియోగిస్తున్నట్లు శ్యామ్‌ తెలిపారు. ఈ పూరేకుల్లో వివిధ రకాల ఫైటోకెమికల్స్​ ఉన్నట్లు శాస్త్రీయంగా పరీక్షించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా యాంటీవైరల్​ గుణాలపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని