12 రాష్ట్రాల్లో రోహింగ్యాలు: కేంద్రం  

మయన్మార్‌ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలు దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.....

Updated : 03 Feb 2021 17:29 IST

దిల్లీ: మయన్మార్‌ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన రోహింగ్యాలు దేశంలోని 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దిల్లీ, తెలంగాణ, యూపీ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌రాయ్‌ రాజ్యసభకు తెలిపారు. సరైన పత్రాలు లేకుండానే అక్రమ పద్ధతుల్లో వీరంతా దేశంలోకి ప్రవేశించినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ఈ విధంగా ఎంతమంది వలసవచ్చి దేశంలో ఉంటున్నారన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదన్నారు.

నివేదికల ప్రకారం.. రోహింగ్యాలు, అక్రమ వలసదారులు ఎక్కువగా జమ్మూకశ్మీర్‌, తెలంగాణ, పంజాబ్‌,  హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, రాజస్థాన్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, అసోం, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉంటున్నట్టు మంత్రి వివరించారు. వీరందరినీ గుర్తించి, దేశం నుంచి పంపడం వారి జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియ తర్వాతే నిరంతరంగా సాగుతుందని చెప్పారు. అక్రమ వలసదారులకు సంబంధించి 2014 ఏప్రిల్‌, 2019 జులై 1న రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచనలు జారీచేసినట్టు పేర్కొన్నారు.

దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీ వలసదారులను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ‘పౌరుల జాతీయత ధ్రువీకరణ ప్రక్రియ ద్వారా రోహింగ్యా వలసదారులను గుర్తించి, వారిని దేశం నుంచి బహిష్కరించడమనేది నిరంతర ప్రక్రియ. రాజ్యాంగంలోని సెక్షన్‌ 3(20)(ఇ), 3(2)(సి) కింద దేశంలోని అక్రమ విదేశీ పౌరుల్ని అదుపులోకి తీసుకోడానికి లేదా బహిష్కరించడానికి కేంద్రానికి అధికారాలు ఉన్నాయి. పాస్‌పోర్టు లేకుండా ఉన్న ఏ వ్యక్తినైనా దేశం నుంచి పంపేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తుంది’ అని రాయ్‌ తెలిపారు. అదేవిధంగా సరైన గుర్తింపు పత్రాలు లేకుండా దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులకు సంబంధించి ప్రభుత్వం వద్ద నిర్దిష్ట సంఖ్య ఏమీ లేదు’ అని నిత్యానందరాయ్‌ లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 

అంతకుముందు శివసేన ఎంపీ అనిల్‌ దేశాయి మాట్లాడుతూ.. ‘దేశంలోకి భారీ సంఖ్యలో ముస్లిం రోహింగ్యాల అక్రమ వలసలు జరుగుతున్నాయి. మరి సరిహద్దుల్లో భద్రతా బలగాలు వారిని దేశంలోకి రానీయకుండా ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి?  అక్రమ వలసదారులను ప్రభుత్వం ఇంకా ఎంత కాలం భరిస్తుంది?’ అని ప్రశ్నించారు.     
 

ఇదీ చదవండి..

రైతుల ఆందోళన..మరో షాహీన్‌బాగ్‌గా మార్చొద్దు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని