UP Bypolls: ‘అవును అంగీకరిస్తున్నా.. నేను క్రిమినల్‌నే’.. ఎస్పీ నేత కీలక వ్యాఖ్య

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.

Published : 24 Jun 2022 01:37 IST

సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) నాయకుడు ఆజం ఖాన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh ) పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆజంగఢ్‌, రాంపూర్‌ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నిక(Lok Sabha bypolls) జరుగుతున్న ముందు రోజు పోలీసులు ఓటర్లను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. బుధవారం రాత్రి రాంపూర్‌ నియోజకవర్గ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.

‘‘నిన్న రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. నా నియోజకవర్గ ప్రజల కోసం మేల్కొనే ఉన్నా. పోలీసులు రాత్రిపూట తిరుగుతూ ప్రజలను ఆందోళనకు గురిచేశారు. రాంపూర్‌లో ప్రతిచోటా పోలీసుల సైరన్లు వినిపించాయి. కొందర్ని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారు. మా పార్టీకి చెందిన లోక్‌సభ అభ్యర్థి.. గంజ్, కొత్వాలి, రాంపూర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. గంజ్ పోలీస్ స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్ ప్రజలపై అమర్యాదగా ప్రవర్తించారు. పోలీసులే స్వయంగా డబ్బులు పంచారని కొంతమంది చెబుతుంటే విన్నాను. ఇది చాలా సిగ్గుచేటు. ఒకవేళ ఉపఎన్నికల్లో పోలింగ్‌ శాతం తగ్గితే ప్రభుత్వానిదే బాధ్యత’’ అని ఖాన్‌ వ్యాఖ్యానించారు.

తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘అవును నేను నేరస్థుడినే. అంగీకరిస్తా. కానీ, నా నగర(రాంపూర్‌) ప్రజలను కూడా అలానే చూడటం ఎంతవరకు సమంజసం. పోలీసులు ఏదైనా చేయగలరు. వాళ్లేం మేం చేసినా భరిస్తూ పోవాలా? ఎన్ని రకాలుగా వాళ్లు ఇబ్బంది పెట్టినా తలొగ్గే ప్రసక్తే లేదు’’ అని అన్నారు. కాగా.. లోక్‌సభ స్థానాల ఉప ఎన్నిక జరుగుతున్న రోజు(గురువారం జూన్‌ 23న) ఖాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదట్లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో అఖిలేశ్‌ తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆజంగఢ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అలాగే సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాంపూర్ లోక్‌సభ స్థానం ఖాళీ అయ్యింది. ఈ రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దాదాపు 35 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాలను తిరిగి దక్కించుకోవడం సమాజ్‌వాదీ పార్టీకి సవాలుగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని