NGO: ఒకే రోజు.. విదేశీ విరాళాల లైసెన్సు కోల్పోయిన 6వేల ఎన్జీవోలు..!

దేశవ్యాప్తంగా దాదాపు 6వేల ఎన్జీవోలు ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి. ఇందులో ఐఐటీ దిల్లీ, జమియా మిలియా ఇస్లామియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌,

Published : 01 Jan 2022 17:32 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా దాదాపు 6వేల ఎన్జీవోలు ఒకే రోజు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి. ఇందులో ఐఐటీ దిల్లీ, జమియా మిలియా ఇస్లామియా, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం అండ్‌ లైబ్రరీ వంటి ప్రముఖ ఎన్జీవోలు కూడా ఉండటం గమనార్హం. వీటిల్లో కొన్ని ఎన్జీవోలు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోకపోగా.. మరికొన్ని సంస్థలు చేసిన దరఖాస్తులను కేంద్ర హోంశాఖ తిరస్కరించిందని అధికారులు శనివారం వెల్లడించారు. 

ఏ ఎన్జీవో సంస్థ అయిన ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థల నుంచి విరాళాలు తీసుకోవాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద లైసెన్సు తీసుకోవాలి. ప్రస్తుతమున్న లైసెన్సు గడువు డిసెంబరు 31తో ముగిసింది. లైసెన్సు పునరుద్ధరణ కోసం సదరు సంస్థలు కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఎన్జీవోలు ఇందుకోసం అప్లికేషన్‌ పెట్టుకోగా.. కొన్ని కారణాల వల్ల వాటిని అధికారులు తిరస్కరించారు. ఇక మరికొన్ని సంస్థలు గడువు ముగిసినా లైసెన్సు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోలేదు.

అలా మొత్తంగా 5933 ఎన్జీవోలు శనివారం విదేశీ విరాళాల లైసెన్సులను కోల్పోయినట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో శనివారం నాటికి 22,762 ఎఫ్‌సీఆర్‌ఏ నమోదిత ఎన్జీవోలు ఉండగా.. నేడు ఆ సంఖ్య 16,829కి తగ్గినట్లు పేర్కొంది. లైసెన్సులను కోల్పోయిన వాటిల్లో ఇందిరా గాంధీ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్ట్స్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి మోమోరియల్‌ ఫౌండేషన్‌, ఆక్స్‌ఫామ్‌ ఇండియా, భారతీయ సంస్కృతి పరిషద్‌, డీఏవీ కాలేజ్‌ ట్రస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సొసైటీ వంటి ప్రముఖ ఎన్జీవోలు కూడా ఉన్నాయి.

ఇటీవల మదర్‌ థెరిసాకు చెందిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ సంస్థ.. బ్యాంకు ఖాతాలను కేంద్రం స్తంభింపజేసిందంటూ వచ్చిన వార్తలు పెద్ద ఎత్తున చర్చకు, రాజకీయ విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ ఖాతాలను స్తంభించలేదని, ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ కోసం చేసుకున్న దరఖాస్తును మాత్రం తిరస్కరించామని కేంద్రం స్పష్టం చేసింది. సంస్థకు సంబంధించి కొంత ‘ప్రతికూల సమాచారాన్ని’ గుర్తించినందువల్లే ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని