red alert: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈమేరకు పలుచోట్ల వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

Published : 09 Jul 2024 11:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ (red alert) ప్రకటించింది. నిన్న ముంబయిలో భారీ వర్షాల దెబ్బకు జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. ఇక అస్సాం, మేఘాలయాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. 

జులై 12న పశ్చిమబెంగాల్‌, సిక్కిమ్‌లలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బిహార్‌లో రానున్న మూడు రోజులు వానలు పడతాయని పేర్కొంది. అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో మాత్రం జులై 11 వరకు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జులై 12న దిల్లీ, హరియాణ, జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ , ఛత్తీస్‌గఢ్‌లో కూడా జడివానలు కురవొచ్చని పేర్కొంది. 

ముంబయిలో పాఠశాలలకు నేడు బీఎంసీ సెలవు ప్రకటించింది. మరోవైపు పుణేలో కూడా 12వ తరగతి వరకు విద్యాసంస్థలు పని చేయవు. రాయగఢ్‌లో కూడా పలు ప్రాంతాలు జలమయం కావడంతో కాలేజీలు, పాఠశాలలు మూసివేశారు. పాల్ఘర్‌, థానే, నాసిక్‌, జల్‌గావ్‌, అహ్మద్‌నగర్‌, కొల్హాపుర్‌, షోలాపుర్‌, సింగ్లి, ఔరంగాబాద్‌, జల్నా, అమరావతి, చంద్రపుర్‌, గడ్చిరౌలిలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని