Weather: ఉత్తరాది గజగజ.. మరో రెండు రోజులు ఇంతే..!

ఉత్తరాదిలో చలిప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

Published : 08 Jan 2023 18:21 IST

దిల్లీ: ఉత్తరాదిన (North India)చలి గజగజ వణికిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇదే పరిస్థితులు మరో రెండు రోజుల పాటు కొనసాగుతాయని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. భారత్‌ (India) లోని ఉత్తర, వాయువ్య ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పశ్చిమ వైపు నుంచి వీచే వేడిగాలుల వల్ల జనవరి 10 తర్వాత పంజాబ్‌, హరియాణాతో పాటు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తెలిపింది. మరోవైపు ఆది, సోమవారాల్లో దిల్లీ, పంజాబ్‌, చండీగఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సోమవారం తర్వాత బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, విదర్భ, చత్తీస్‌గఢ్‌, పశ్చిమ మధ్యప్రదేశ్‌, తెలంగాణ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశముందని ఐఎండీ  వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో దిల్లీ, పంజాబ్‌, హరియాణా, చత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు రాజస్థాన్‌లోని ఉత్తరభాగంలో దట్టమైన పొగమంచుకురిసే అవకాశముందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, సిక్కిం, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర తదితర రాష్ట్రాల్లోనూ పొగమంచు ప్రభావం ఉంటుందని చెప్పింది. అరేబియా సముద్రం మీదుగా వీచే గాలుల వల్ల జనవరి 10 నుంచి 13 తేదీల మధ్య పశ్చిమ హిమాలయ రీజియన్‌లో కొన్ని చోట్లు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని