మహమ్మారిపై భారత్‌ పోరు ప్రశంసనీయం!

కరోనా వైరస్‌ మహమ్మారితోపాటు దానివల్ల ఎదురైన ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కోవడంతో భారత్‌ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్రశంసించింది.

Published : 15 Jan 2021 10:37 IST

అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్‌ వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారితోపాటు దానివల్ల ఎదురైన ఆర్థిక పర్యవసానాలను ఎదుర్కోవడంతో భారత్‌ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్రశంసించింది. అంతేకాకుండా వేగంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా చేపట్టాలని సూచించింది. కరోనా కాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అప్‌డేట్‌ ఆవిష్కరణలో ప్రముఖంగా ఇదే విషయాన్ని వెల్లడించబోతున్నట్లు వెల్లడించారు. వరల్డ్‌ ఎకనమిక్‌ అప్‌డేట్‌ను జనవరి 26న విడుదల చేస్తున్నామని.. దీన్ని ప్రతి ఒక్కరూ శ్రద్ధగా గమనించాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.

అత్యంత రద్దీ, అధిక జనసాంద్రత కలిగిన భారత్‌లో‌ సుదీర్ఘ కాలం పాటు లాక్‌డౌన్‌ కొనసాగిన తీరును ఐఎంఎఫ్‌ చీఫ్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్‌ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పనిచేసినట్లు అభిప్రాయపడ్డారు. అయితే, ఆర్థికవ్యవస్థను మరింత ముందుకు నడిపించడం కోసం 2021 ఏడాదిని భారత్‌ మరింత వినియోగించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా భారత్‌ చేపడుతోన్న నిర్మాణాత్మక సంస్కరణలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంస్కరణలతో మరింత ముందుకు వెళ్లాలని ఐఎంఎఫ్‌ చీఫ్‌ భారత్‌కు సూచించారు.

వ్యవసాయ చట్టాలపై IMF ఏమన్నదంటే..!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలు వ్యవసాయ సంస్కరణల్లో ఓ ముందడుగని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభిప్రాయపడింది. వీటివల్ల మధ్యవర్తుల అవసరం లేకుండానే రైతులు నేరుగా పంటను విక్రయించే అవకాశం ఉంటుందని తెలిపింది. అయినప్పటికీ, ఈ నూతన విధాన మార్పుల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నవారికి సామాజిక భద్రతను కల్పించాల్సిన అవసరముందని ఐఎంఎఫ్‌ స్పష్టంచేసింది.

ఇవీ చదవండి..
WHO అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం!
మితృ హంతకికి మరణశిక్ష

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని