JP Nadda: యువత మన దేశానికి వరమే.. కానీ,..: జేపీ నడ్డా

జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) పిలుపునిచ్చారు.

Published : 11 Jul 2024 18:10 IST

దిల్లీ: జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన గర్భనిరోధక విధానాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కుటుంబ నియంత్రణ (Family planning) హక్కును మహిళలు వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా జనాభా వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో గర్భనిరోధకాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకొని దిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నడ్డా మాట్లాడారు.

‘‘ప్రపంచ జనాభాలో ఐదో వంతు మనమే ఉన్నాం. జనాభా పరంగా భారత్‌ మొదటి స్థానంలో ఉంది. అందువల్ల జనాభాను అదుపు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మనదేశ జనాభాలో 65 శాతం మంది యువత. నిజానికి ఇది మనకు వరమే. దేశాభివృద్ధిలో యువతే కీలకం. మరోవైపు జనాభా నియంత్రణకు కూడా యువతను ఓ అవకాశంగా తీసుకోవాలి. వారిలో చైతన్యం తీసుకొస్తే.. భవిష్యత్‌లో జనాభాను నియంత్రించడం పెద్ద కష్టమేమీకాదు. తక్కువ మంది పిల్లలుంటే వారికి మంచి జీవితాన్ని ఇవ్వొచ్చన్న విషయాన్ని అందరికీ తెలియజేయాలి’’ అని నడ్డా పేర్కొన్నారు. కుటుంబం అభివృద్ధి చెందితే.. దేశం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కుటుంబ నియంత్రణపై యువతలో అవగాహన ఏర్పడితే.. భవిష్యత్‌లో జనాభా పెరుగుదలపై స్థిరత్వాన్ని సాధించగలుగుతామన్నారు.

ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్లు. 2021 నాటికి అది సుమారు 7.9 బిలియన్లకు చేరుకుంది. 2030 నాటికి 8.5 బిలియన్లు, 2050 నాటికి 9.7 బిలియన్లు, 2100 నాటికి 10.9 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని