Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్‌ : ది లాన్సెట్‌

రోడ్డు భద్రతా చర్యలను మరింత మెరుగుపరచడం వల్ల భారత్‌లో ఏటా దాదాపు 30వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని తాజా నివేదిక వెల్లడించింది.

Updated : 01 Jul 2022 09:35 IST

దిల్లీ: రోడ్డు భద్రతా (Road Safety) చర్యలను మరింత మెరుగుపరచడం వల్ల భారత్‌లో (India) ఏటా దాదాపు 30వేల మంది ప్రాణాలను కాపాడవచ్చని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా అతివేగం, తాగి డ్రైవింగ్‌ చేయడం, హెల్మెట్‌ ధరించకపోవడం, సీటు బెల్టు వాడకపోవడం వంటివి ప్రమాదానికి కారణాలుగా తేలిందని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ది లాన్సెట్‌ (Lancet) నివేదిక పేర్కొంది.

‘కేవలం అతివేగాన్ని గుర్తించి అరికట్డడం వల్ల ఏటా దాదాపు 20,554 మంది ప్రాణాలు కాపాడుకోవచ్చు. హెల్మెట్‌లను ప్రోత్సహించడం వల్ల 5,683 మంది, సీటు బెల్టు వాడకం వల్ల మరో 3,204 మంది ప్రాణాలను రక్షించుకోవచ్చు’ అని తాజా నివేదికలో పేర్కొంది. అయితే, ఈ నివేదిక రూపొందించే నాటికి భారత్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌కి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని తెలిపింది. 

ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 13.5లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో 90శాతానికి పైగా మరణాలు కేవలం అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రహదారి భద్రతపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశోధకులు సూచించారు. ముఖ్యంగా ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి ఈ ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉందని తాజా నివేదిక నొక్కిచెప్పింది. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 185 దేశాల్లో చేసిన 74 అధ్యయనాల ప్రకారం.. హెల్మెట్‌, సీట్‌బెల్డ్‌ పెట్టుకోవడం, అతివేగం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లను నియంత్రించడం వల్ల ఏటా 3.47 లక్షల నుంచి 5.4 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని నివేదిస్తున్నాయి. అంతేకాకుండా 25-40 శాతం మధ్య రోడ్డు ప్రమాదాలను కూడా నిరోధించవచ్చని అంచనా వేస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని