Imran Khan: మాకూ భారత్‌లానే కావాలి..!

అంతర్జాతీయ సంబంధాల్లో ఒక దేశంతో మరో దేశం పోల్చుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ సంబంధాలు మొత్తం అవసరాలపైన, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి.

Updated : 27 Jun 2021 12:09 IST

 పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ విచిత్ర వైఖరి

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అంతర్జాతీయ సంబంధాల్లో ఒక దేశంతో మరో దేశం పోల్చుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ సంబంధాలు మొత్తం.. అవసరాలపైన, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి. ఈ విషయం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌  మరిచిపోయినట్లున్నారు. ఆయన ఈ మధ్య ప్రతిదీ భారత్‌తో పోల్చుకొని చూసుకొంటున్నారు. దీంతో కొన్ని సార్లు ఆయనకు షాకులు కూడా తగిలాయి. అయినా తీరులో మార్పు రాలేదు. తాజాగా ఆయన ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్నిఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా నుంచి పాకిస్థాన్‌ గౌరవప్రదమైన, ఉన్నతమైన సంబంధాలు కోరుకుంటోందని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఆ సంబంధాలు అమెరికా-యూకే మధ్య లేదా.. అమెరికా-భారత్‌ మధ్యలో ఉన్నట్లు ఉండాలన్నారు. అమెరికాకు ఉగ్రవాదంపై పోరులో పాక్‌ వీలైనంత అండగా నిలిచిందని ఇమ్రాన్‌ అభిప్రాయపడ్డారు. దీనికి 70వేల ప్రాణాలు, 150 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తుల రూపంలో భారీ మూల్యం చెల్లించామన్నారు. కానీ అమెరికా మాత్రం తాము సరైన అండదండలు ఇవ్వలేదనే భావనలో ఉందని వివరించారు. అఫ్గానిస్థాన్‌ శాంతి చర్చల కోసం తాము చేయగలిగినంత చేశామన్నారు. భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు మెరుగుపడకపోవడంపై కొంత నిరాశ వ్యక్తం చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత.. భారత ప్రధాని నరేంద్రమోదీని ఈ విషయమై సంప్రదించినా ఫలితం లేకపోయిందన్నారు. జమ్ము-కశ్మీర్‌ విషయంలో భారత్‌ తీసుకొన్న నిర్ణయం బెడిసికొడుతుందన్నారు. అంతేకాదు.. చైనా విషయంలో భారత్‌ తీరు ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఇరుదేశాల మధ్య వ్యాపారం భారత్‌-చైనాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

అదే సమయంలో భారత్‌ గొప్ప భాగస్వామి అని శ్వేతసౌధం ప్రకటన విడుదల చేయడం విశేషం. శ్వేతసౌధ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ ఈ విషయాన్ని తెలిపారు. ఇక ఓ పక్క శ్వేతసౌధంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనితో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భేటీ అయిన సమయంలో ఈ ఇంటర్వ్యూ జరిగింది. తాలిబాన్లను పాక్‌ ఎగదోస్తోందని అఫ్గాన్‌ నేతలు కొన్నాళ్ల నుంచి ఆరోపిస్తున్నారు.

ఇలా కోరినందుకే యూకే పర్యటన రద్దు..!

వచ్చే నెలలో జరగాల్సిన యూకే పర్యటనను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ రద్దు చేసుకొన్నారు. ఈ పర్యటనలో ఆయన ఓ క్రికెట్‌ మ్యాచ్‌కు హాజరుకావడంతో పాటు.. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో భేటీ కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ డిమాండ్‌ విషయంలో యూకే నుంచి మొండి చెయ్యి ఎదురుకావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. ఇటీవల భారత్‌-యూకే మధ్య వచ్చే పదేళ్ల సంబంధాలపై ఓ రోడ్‌మ్యాప్‌కు అంగీకారం తెలుపుతూ సంతకాలు జరిగాయి. రక్షణ, శాస్త్రసాంకేతిక రంగాల్లో సహకారంతో పాటు భారతీయులు యూకేకు వెళ్లడాన్ని మరింత సులువు చేయనున్నారు.  పాకిస్థాన్‌ కూడా ఇలాంటి  రోడ్‌మ్యాప్‌  ఒప్పందాన్ని చేసుకోవాలనుకుంటోందని యూకేకు వెల్లడించారు. కానీ, యూకే దీనిని తేలిగ్గా తీసుకొంది.  కేవలం ఒక క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటానికి మాత్రమే వెళ్లాల్సి రావడాన్ని ఇమ్రాన్‌ అవమానంగా భావించారు. దీంతో చేసేది లేక ఆ పర్యటనను రద్దు చేసుకొన్నారు. 

ఇమ్రాన్‌కు అది కూడా తెలియదా..?

ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేసి నవ్వుల పాలయ్యారు. ఆయన బుధవారం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కో ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌కు ఫోన్‌ చేశారు. పాక్‌లో పోలియో నిర్మూలన వ్యాక్సినేషన్‌ చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. పనిలోపనిగా పాకిస్థాన్‌లో మైక్రోసాఫ్ట్‌ ఇంక్యూబేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. వాస్తవానికి బిల్‌ గేట్స్‌ ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ బోర్డులో లేరు. గతేడాది ఆయనపై ఆరోపణలు వచ్చిన సమయంలో బోర్డు నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు కేవలం షేర్‌ హోల్డర్‌ మాత్రమే. ఇక ఆయన ఛైర్మన్‌ పదవి దిగిపోయి కూడా చాలా ఏళ్లవుతుంది. మరి ఆయన ఏ అధికారంతో మైక్రోసాఫ్ట్‌ కేంద్రాన్ని పాకిస్థాన్‌లో ఏర్పాటు చేస్తారో ఇమ్రాన్‌ఖాన్‌కే తెలియాలి. మైక్రోసాఫ్ట్‌ నిర్ణయాలు బోర్డు, సీఈవో, ఛైర్మన్‌లు తీసుకొంటారన్న విషయాన్ని ఇమ్రాన్‌ ఎందుకు విస్మరించారో తెలియదు.  ఆయన చేసిన ట్వీట్‌ను పాకిస్థానీయులే విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. అమెరికా బయట మైక్రోసాఫ్ట్‌ అతిపెద్ద ఆఫీస్‌ భారత్‌లోని హైదరాబాద్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని