ఇమ్రాన్‌ ఆట ముగియనుందా..!

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఓ వైపు రాజకీయ సవాళ్లు మరోవైపు ఆర్థిక సమస్యలు, ఇంకా పేదరికం, నిరుద్యోగం ఉండనే ఉన్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇమ్రాన్‌ ఎత్తుకున్న

Updated : 11 Mar 2021 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టు ముడుతున్నాయి. ఇప్పటికే ఓ వైపు రాజకీయ సవాళ్లు మరోవైపు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇమ్రాన్‌ ఎత్తుకున్న ‘నయా పాకిస్థాన్‌’ నినాదం వింటుంటే ఆ దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోందట. సైన్యం కూడా అవసరమా మాకు ఈ భుజం మోత అని భావిస్తోందట. ఇక ప్రపంచదేశాల నుంచి తీసుకువచ్చిన అప్పుల కుప్ప పేరుకుపోతుండగా.. పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఆట ఆఖరి అంకానికి చేరిందన్న విశ్లేషణలు బయలుదేరాయి.

ప్రజల్లో తగ్గుతున్న విశ్వాసం!

ఇమ్రాన్‌ఖాన్‌ క్రికెట్‌ ద్వారా పాకిస్థాన్‌కు అంతర్జాతీయ గౌరవాన్ని తెచ్చిపెట్టిన గొప్ప ఆటగాడు. రాజకీయాల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తానంటూ వచ్చిన ఇమ్రాన్‌ను మొత్తానికి దేశాధినేతను కూడా చేశారు. ఆయన అధికారంలోకి వచ్చేటప్పటికి పాకిస్థాన్‌ అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోంది. ఆల్‌రౌండర్‌ను కదా.. అన్నీ తనే ఆడేయొచ్చు అనుకున్న ఇమ్రాన్‌కు ఇప్పుడు అధికారం నిలుపుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ‘నయా పాకిస్థాన్‌’ ఇమ్రాన్‌ నినాదం.. అన్నట్లే గతంలో కంటే మరింత కొత్త ఎత్తులకు ద్రవ్యోల్బణం చేరుతోంది. దేశాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి. పేదరికం వెక్కిరిస్తోంది. నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. ఈ తరుణంలో ప్రజల్లోనూ ఇమ్రాన్‌ పాలనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకే ఆయన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రి కూడా జనరల్‌ సెనేట్‌ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. గతేడాది పాకిస్థాన్‌లో రాజకీయ పార్టీలన్నీ ఒక వేదికపైకి వచ్చి ఇమ్రాన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ ప్రజాస్వామ్య కూటమిగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నాయి. ఆ కూటమి అభ్యర్థి మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీనే.. మొన్నటి ఎన్నికల్లో ఇమ్రాన్‌ ప్రభుత్వంలో మంత్రిని ఓడించారు.  ఆ ఓటమి తర్వాత ఇమ్రాన్‌ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కొంది.

దూకుడుగా విపక్ష కూటమి

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్‌ సర్కారు నెగ్గింది కానీ.. సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ఆ ఓటింగ్‌ రోజున నవాజ్‌ షరీఫ్‌ పార్టీకి చెందిన ఎంపీలపై తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ ప్రతినిధులు చేయి చేసుకోవడం అధికార పార్టీలో గూడు కట్టుకున్న అసహనాన్ని ఎత్తిచూపింది. అధికారంలో ఉంటే ఏదైనా సాధ్యమని భావిస్తున్న ఇమ్రాన్‌ పదవి వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఇన్నాళ్లూ ఇమ్రాన్‌ సర్కార్‌కి వ్యతిరేకంగా ఉన్న వారిపై ఉక్కుపాదం మోపుతూ వచ్చిన సైన్యం ఎప్పుడు పక్కకు తప్పుకుంటుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లూ మీడియాని గుప్పిట పట్టి ఇమ్రాన్‌ రోజులు నెట్టుకొస్తుండగా.. ఆయన ప్రభుత్వ అరాచకాలను వెలుగులోకి తేవడంలో అంతర్జాతీయ మీడియాని, సోషల్‌ మీడియాని విపక్ష కూటమి సమర్థంగా వినియోగించుకుంది. ప్రజల్లో తిరుగుబాటు తీసుకురాగలిగింది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్‌ ప్రభుత్వం నుంచి వైదొలగాలని కొందరు చూస్తుండగా.. ఆయన మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పీఎంఎల్‌ఎన్‌, జర్దారీ పార్టీకి మధ్య ఒప్పందం కుదిరిన రోజు ఇమ్రాన్‌ సర్కార్‌ కూలడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అది కూడా ఇంకా ఎంతో దూరంలో లేదని ఇమ్రాన్‌ ఆట కట్టనుందని చెబుతున్నారు.

పేరుకు పోతున్న అప్పులు

దేశంలోకి పెట్టుబడులు ఎలాగూ రావు. సంపద సృష్టి అన్నది లేనే లేదు. ఈ పరిస్థితుల్లో అప్పులనే నమ్ముకున్న ఇమ్రాన్‌.. ప్రస్తుత పాకిస్థాన్‌ ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లోనే విదేశాల నుంచి 670 బిలియన్‌ డాలర్లు అప్పులు చేశారు. ఇందులో చైనా నుంచి గతనెలలో తెచ్చుకున్న వాణిజ్య అప్పు 500 మిలియన్‌ డాలర్లు కూడా ఉంది. ఈ 7నెలల వ్యవధిలోనే పాకిస్థాన్‌ అప్పులు 300 బిలియన్‌ డాలర్ల మేర పెరిగాయి. ఇంతలా అప్పులు పేరుకు పోవడం సహా నిరుద్యోగం, పేదరికం, తాండవిస్తుండడంతో పాకిస్థానీలు ఇమ్రాన్‌ పట్ల విశ్వాసాన్ని కోల్పోయారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోసారి తమ జీవితంలో పాకిస్థానీలు ఇమ్రాన్‌ను నమ్మే అవకాశం లేదని.. ఆయన శకానికి తెరపడుతుందని అంటున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని