RIMC: వందేళ్ల తర్వాత ఆ పాఠశాలలో బాలికలకు ప్రవేశం..

ఉత్తరాఖండ్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ) వందో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ మిలిటరీ స్కూల్‌ చారిత్రక నిర్ణయం తీసుకుంది

Published : 14 Mar 2022 12:32 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ(ఆర్‌ఐఎంసీ) వందో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఈ మిలిటరీ స్కూల్‌ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ స్కూల్‌లో తొలిసారిగా అమ్మాయిలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన శత వసంత వేడుకల్లో ఆర్‌ఐఎంసీ కమాండెంట్‌ కల్నల్‌ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీని 1922 మార్చి 13న అప్పటి బ్రిటిష్‌ - ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ యువతకు ఈ కాలేజీలో మిలిటరీ శిక్షణ ఇచ్చి ఆ తర్వాత బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీలో అధికారులుగా తీసుకునేవారు. ఇందులో 8వ తరగతి నుంచి ప్రవేశాలు ఉంటాయి. ఈ మిలిటరీ స్కూల్‌ను ప్రారంభించినప్పటి నుంచి అబ్బాయిలనే చేర్చుకుంటున్నారు. ఇందులో శిక్షణ పొందిన వారు ఎన్‌డీయే(నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ), నావెల్‌ అకాడమీలో చేరుతుంటారు.

అయితే ఇటీవల ఎన్‌డీయేలో మహిళలకు ప్రవేశాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము కూడా బాలికలను చేర్చుకోవాలని నిర్ణయించినట్లు కల్నల్‌ అజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఏడాది జులైలో ఐదుగురు విద్యార్థినులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. ‘‘బాలికల కోసం ఈ ఏడాది 5 సీట్లు కేటాయించాం. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. 568 మంది అమ్మాయిలు హాజరయ్యారు. బాలికలను చేర్చుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నాం. అంతేగాక విద్యార్థినులను సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మార్పులు చేపట్టనున్నాం’’ అని ఆయన వెల్లడించారు.

‘‘1992లో ప్రయోగాత్మకంగా ఓ అమ్మాయిని చేర్చుకున్నాం. ఓ ఫ్యాకల్టీ కుమార్తె అయిన స్వర్ణిమా తప్లియాల్‌ను తొలి ఏడాదిలో చేర్చుకున్నాం. ఆమె ఆ తర్వాత ఆర్మీలో విజయవంతంగా సేవలందించి మేజర్‌గా రిటైర్‌ అయ్యారు’’ అని అజయ్‌ కుమార్‌ ఈ సందర్భంగా తెలిపారు. 

ఆదివారం ఈ స్కూల్‌ శత వసంత వేడుకలు జరగ్గా.. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్మీత్‌ సింగ్‌(రిటైర్డ్‌) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మంది పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో చాలా మంది త్రివిధ దళాల్లో పనిచేసిన వారే. ఇక్కడి నుంచి శిక్షణ పొందిన ఆరుగురు త్రివిధ దళాలకు సర్వీస్‌ చీఫ్‌లుగా పనిచేసినట్లు కల్నల్‌ అజయ్‌ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని