IAF: భారత్‌లో తొలి డ్రోన్‌ దాడి..?

భారత్‌ ఏ విషయంలో ఆందోళన చెందుతోందో  ఇప్పుడు అదే వాస్తవ రూపం ధరిస్తోంది. ఉగ్రమూకలు ఇప్పుడు వీటి వినియోగం చేపట్టాయి. తాజాగా నేడు జమ్ములోని వాయుసేన ఎయిర్‌ పోర్టులోని హ్యాంగర్లపై జరిగిన దాడికి డ్రోన్లను వినియోగించాయి.

Updated : 27 Jun 2021 19:27 IST

 ఎంఐ17, రవాణా విమానానికి తప్పిన ముప్పు..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ ఏ విషయంలో ఆందోళన చెందుతోందో ఇప్పుడు అదే వాస్తవ రూపం ధరిస్తోంది. ఉగ్రమూకలు ఇప్పుడు డ్రోన్ల వినియోగం చేపట్టాయి. తాజాగా నేడు జమ్ములోని వాయుసేన ఎయిర్‌ పోర్టులోని హ్యాంగర్లపై జరిగిన దాడికి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు వాయుసేన ఆయుధాలకు, వాహనాలకు ఎటువంటి నష్టం జరగలేదు. ఇద్దరు సిబ్బంది మాత్రం స్వల్పంగా గాయపడ్డారు.  భారత్‌లో జరిగిన తొలి డ్రోన్‌ దాడి ఇదే..!

అసలేం జరిగింది..?

నిన్న అర్ధరాత్రి 1.30 సమయంలో గుర్తు తెలియని డ్రోన్లు తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చి జమ్ము వాయుసేన స్థావరంలోని హ్యాంగర్ల (విమానాలు, హెలికాప్టర్లను భద్రపర్చే గోదామువంటివి) వద్ద పేలుడు పదార్థాలను జారవిడిచాయి. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే మరో చోట పేలుడు పదార్థాలను పడేశాయి. ఎంఐ17 హెలికాప్టర్లను, రవాణా విమానాలను ఈ ప్రదేశాలకు సమీపంలో భద్రపరుస్తుంటారు. వీటికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఫోరెన్సిక్‌ సిబ్బంది, వాయుసేన బృందం, ఇతర భద్రతా దళాలు అక్కడకి చేరుకొన్నాయి. విమానాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు.

తొలి సారి డ్రోన్ల వినియోగం..

భారత్‌లో డ్రోన్లను వినియోగించి రక్షణ దళాలపై చేసిన తొలిదాడిగా దీనిని భావిస్తున్నారు. ఈ పేలుళ్లలో ఒక భవనం పైకప్పునకు భారీ  రంధ్రం పడింది. రెండో పేలుడు బాహ్య ప్రదేశంలో జరిగింది. ఈ డ్రోన్లను రాడారు గుర్తించలేదు.

పాకిస్థాన్‌ ఇప్పటికే పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌లలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ఆయుధ సరఫరా చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని కూడా రాడార్లు గుర్తించడంలేదు. పాకిస్థాన్‌ సరిహద్దుకు ఈ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఆయుధాలు జారవిడిచే డ్రోన్లు దాదాపు 12 కిలోమీటర్లకు పైగా చొచ్చుకు వచ్చాయి.

* 2019 ఆగస్టు 13న అమృత్‌సర్‌ సమీపంలోని మోహవా గ్రామం వద్ద కూలిపోయిన పాక్‌ డ్రోన్‌ శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

* 2019 సెప్టెంబర్‌ 9-16 మధ్య ఎనిమిది సార్లు డ్రోన్లు వచ్చి ఆయుధాలు, నగదు, మందుగుండు సామగ్రిని జారవిడిచి వెళ్లాయి. సెప్టెంబర్‌ 22న ఓ ఉగ్రవాదిని అరెస్టు చేస్తే ఈ విషయం బయటపడింది.

* 2020 జూన్‌ 20వ తేదీన జమ్ములోని హీరానగర్‌ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్‌ ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసింది.

* 2020 సెప్టెంబర్‌ 19న జమ్ముకశ్మీర్‌ పోలీసులు ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఆ ముందు రోజు రాత్రి వీరికి డ్రోన్‌ ద్వారా ఆయుధాలు సరఫరా అయినట్లు తేలింది.

* 2020 సెప్టెంబర్‌ 22న అక్నూర్ సెక్టార్‌లో డ్రోన్‌ ద్వారా ఆయుధాలు జారవిడిచనట్లు పోలీసులు గుర్తించారు.

యాంటీ డ్రోన్‌ టెక్నాలజీపై చర్చలు..

డ్రోన్లను గుర్తించడం చాలా కష్టమైన పని.  ఆర్‌ఎఫ్‌ మానిటరింగ్‌, రాడార్‌, ఆప్టికల్‌ సెన్సర్‌ విధానాలతో వీటిని గుర్తించగలం. వీటిల్లో ప్రతి విధానానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

* ఆర్‌ఎఫ్‌(రేడియో ఫ్రీక్వెన్సీ) మానిటరింగ్‌తో శాటిలైట్‌ ఆధారిత డ్రోన్లు, ముందే ప్రోగ్రాం చేసిన డ్రోన్లను గుర్తించడం కష్టం.

* ఇక రాడార్లు గుర్తించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఆ రాడార్‌ రేంజి, సామర్థ్యం, ఆ డ్రోన్‌ ఎగిరే ఎత్తు వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి.

* థర్మల్‌ కెమెరాల వంటి వాటిని వాడి ఆప్టికల్‌ సెన్సర్‌ విధానంలో గుర్తిస్తారు. ఇది ఎక్కువ దూరంలో ఉన్నవాటిని గుర్తించలేదు.

డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి భారత్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.  వీటిల్లో సాఫ్ట్‌కిల్‌, హార్డ్‌కిల్‌ అని రెండు రకాలు ఉంటాయి. డ్రోన్‌ను గుర్తించి దాని కంట్రోలింగ్‌ సంబంధాలను దెబ్బతీయడం సాఫ్ట్‌కిల్‌ కోవలోకి వస్తుంది. ఇక ఆయుధాలు వాడి డ్రోన్‌ను కూల్చేయడం హార్డ్‌కిల్‌ కోవలోకి వస్తుంది.

భారత్‌ ఇజ్రాయెల్‌ వంటి దేశాల నుంచి యాంటీడ్రోన్‌ టెక్నాలజీని కొనుగోలు చేయడానికి యత్నాలు చేస్తోంది. స్మాష్‌2000 ప్లస్‌ కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది. ఇజ్రాయెల్‌ సంస్థ స్మార్ట్‌ షూటర్‌తో చర్చలు జరుపుతోంది. మరోపక్క డీఆర్‌డీవో కూడా యాంటీ డ్రోన్‌ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనిని గత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట వద్ద మోహరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని