75 డ్రోన్లు విరుచుకుపడి..!

భారత్‌ డ్రోన్ల తయారీలో కీలక ముందడుగు వేసింది. నేడు ఆర్మీడే సందర్భంగా దాడి చేయగల డ్రోన్ల దండును ప్రదర్శించింది. పదుల సంఖ్యలో ఉండే డ్రోన్ల గుంపు ట్యాంకులు, శత్రు స్థావరాలు, ఉగ్రక్యాంపులు,హెలీప్యాడ్‌లు,ఇంధన

Updated : 23 Aug 2022 14:15 IST

 తొలిసారి స్వార్మ్‌టెక్నాలజీని ప్రదర్శించిన భారత్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ డ్రోన్ల తయారీలో కీలక ముందడుగు వేసింది. నేడు ఆర్మీడే సందర్భంగా దాడి చేసే సామర్థ్యంతో కూడిన  డ్రోన్ల దండును ప్రదర్శించింది. పదుల సంఖ్యలో ఉండే డ్రోన్ల గుంపు.. ట్యాంకులు, శత్రు స్థావరాలు, ఉగ్రక్యాంపులు, హెలీప్యాడ్‌లు, ఇంధన నిల్వలపై ఒక్కసారిగా విరుచుకుపడి  విధ్వంసం చేయగలవు. ఈ టెక్నాలజీ భారత ఆయుధ రంగంలో కీలకం కానుంది.

డ్రోన్ల ఆత్మాహుతి దాడి

భారత్‌ నేడు  స్వతంత్రంగా పనిచేసే 75 డ్రోన్లతో స్వార్మ్‌ టెక్నాలజీని ప్రదర్శించింది. ఇవి వాటంతటవే లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేయగలవు. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డ్రోన్‌ టెక్నాలజీకి ఇదో తురుపు ముక్క. ఈ టెక్నాలజీని ప్రైవేటు కంపెనీలతో కలిసి భారత్‌ అభివృద్ధి చేసింది. ఇది భారత్‌ యుద్ధ తంత్రాన్ని పూర్తి స్థాయిలో మార్చేస్తుందని సైన్యం చెబుతోంది.

దాడులకే కాదు.. సాయానికి కూడా..

ఈ డ్రోన్ల దండు కేవలం శత్రువులపై దాడి చేయడానికే కాదు.. క్లిష్ట సమయాల్లో సైన్యానికి సాయం చేయడానికీ  ఉపయోగించవచ్చు. కఠినమైన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న సైనిక 
స్థావరాలకు సరుకులు, ఔషధాలు వంటివి చేర్చడానికి ఉపయోగించవచ్చు. 75 డ్రోన్ల సమూహం 600 కిలోల సరుకులను సరఫరా చేయగలదు.

ఆగస్టులో మొదలుపెట్టి..

భారత్‌ స్వార్మ్ ‌టెక్నాలజీపై చాలా వేగంగానే పట్టు సాధించింది. సైన్యం గతేడాది ఆగస్టులో స్వార్మ్‌ టెక్నాలజీపై పనిచేయడం మొదలుపెట్టింది. న్యూస్పేస్‌ రీసెర్చి అండ్‌ టెక్నాలజీస్‌తో కలిసి పరిశోధనలు మొదలుపెట్టింది. తొలుత ఐదు డ్రోన్లను ఎగరవేసింది. ఇప్పటికి 75డ్రోన్లను ప్రయోగించే స్థాయికి చేరింది. 1,000 రోటరీ వింగ్‌ డ్రోన్లను ప్రయోగించాలనే లక్ష్యంతో పనిచేసింది.

మదర్‌ డ్రోన్‌ వ్యవస్థ..

ఆర్మీడే కార్యక్రమంలో భారత్‌ మదర్ ‌డ్రోన్‌ వ్యవస్థను కూడా ప్రదర్శించింది. దీనిలో ఒక డ్రోన్ల సమూహంలో మదర్‌డ్రోన్‌లు కూడా ఉంటాయి. ఒక్కో మదర్‌ డ్రోన్‌ నాలుగు ఛైల్డ్‌ డ్రోన్లను విడుదల చేస్తాయి. ఈ నాలుగు వేర్వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. దీంతోపాటు భారత్‌ స్వార్మ్‌డ్రోన్‌ సిస్టమ్‌ లాంఛ్‌ చేసే వేదికల అభివృద్ధిపై కూడా పని మొదలుపెట్టింది. ఎల్‌ఏసీ వద్ద ప్రత్యర్థుల ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి వీటిని వినియోగించే అవకాశం ఉంది. ప్రాజెక్టులో భాగంగా ఓ జాగ్వర్‌ విమానం నుంచి 24 వరకు డ్రోన్లను ప్రయోగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో రెండు స్టార్టప్‌లతోపాటు హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ కూడా పనిచేస్తోంది. దీంతోపాటు కంబాట్‌ ఎయిర్‌ టీమింగ్‌ సిస్టమ్‌ను కూడా నాలుగేళ్లలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ వ్యవస్థను యుద్ధవిమానాలను శత్రువుల ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల నుంచి కాపాడుకునేందుకు వాడతారు.

ఇదీ చదండి

‘మీ త్యాగాలకు భారతావని రుణపడి ఉంటుంది’

వ్యాక్సినేషన్‌.. ఈ రూల్స్‌ మర్చిపోవద్దు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని