SSC: ఎస్‌ఎస్‌సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. 13 ప్రాంతీయ భాషల్లో ‘ఎంటీఎస్‌’ పరీక్ష

స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (SSC) నిర్వహించే మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పరీక్షను ఈ సారి 15 భాషల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే జరుపుతుండగా.. ఈసారి 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.

Updated : 20 Jan 2023 20:42 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలో దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షా విధానంలో కీలక మార్పులు తెచ్చింది. ఇప్పటివరకు కేవలం హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తుండగా.. తాజాగా 13 ప్రాంతీయ భాషల్లోనూ వీటిని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మల్టీ-టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌ ఎగ్జామ్‌- 2022ను ప్రాంతీయ భాషలతోపాటు మొత్తం 15 భాషల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది.  హిందీ, ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, ఉర్దూ, తమిళం, మలయాళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపూరి(మైతి), మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లో పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది. ఎమ్‌టీఎస్‌ పరీక్షను ఇలా ప్రాంతీయ భాషల్లో చేపట్టడం ఇదే తొలిసారి.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు ఉండాలనే ప్రధాని మోదీ ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఉద్యోగ నియామకాల్లో భాష అవరోధంతో ఏ ఒక్కరూ అవకాశం కోల్పోవద్దనేదే తమ ఉద్దేశమన్నారు. ఇదే విషయంపై వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోకాలంగా అభ్యర్థనలు వస్తున్నాయని.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థల్లో అతిపెద్దదిగా ఉన్న ఎస్‌ఎస్‌సీ.. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని గ్రూప్‌-బీ (నాన్‌-గెజిటెడ్‌), గ్రూప్‌-సీ (నాన్‌-టెక్నికల్‌) విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంది. కానీ ఇప్పటివరకు కేవలం ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో మాత్రమే పరీక్షలను నిర్వహించేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని