Rahul Gandhi: ‘అప్పీల్‌ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్‌ అనర్హతపై జర్మనీ స్పందన

తన అనర్హత (Disqualification)కు కారణమైన జైలు శిక్ష తీర్పుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అప్పీల్‌ చేసుకునే స్థితిలోనే ఉన్నారని జర్మనీ అభిప్రాయపడింది. రాహుల్‌ అనర్హత వ్యవహారంపై జర్మనీ తాజాగా స్పందించింది.

Updated : 30 Mar 2023 15:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అనర్హత (Disqualification) వ్యవహారం దేశవ్యాప్తంగానే గాక.. అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది. రాహుల్‌ కేసును తాము గమనిస్తున్నామని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా వెల్లడించగా.. తాజాగా జర్మనీ (Germany) కూడా స్పందించింది. రాహుల్‌ కేసులోనూ ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని, తీర్పుపై ఆయన అప్పీల్‌ చేసుకోవచ్చని పేర్కొంది. (Rahul Gandhi Disqualification)

‘‘భారత్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష.. ఆ తీర్పు కారణంగా ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దవ్వడం వంటి అంశాలను మేం గమనిస్తున్నాం. అయితే ఈ తీర్పుపై ఆయన అప్పీల్‌ చేసుకునే స్థితిలోనే ఉన్నారు. అప్పుడే ఈ తీర్పు నిలబడుతుందా.. ఏ ప్రాతిపదికన ఆయనపై అనర్హత పడింది అనేది స్పష్టమవుతుంది. ఈ కేసుకు న్యాయ స్వతంత్రత ప్రమాణాలు, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలు వర్తిస్తాయని జర్మనీ (Germany) భావిస్తోంది’’ అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇటీవల, అమెరికా (US) కూడా రాహుల్‌ ‘అనర్హత’ వ్యవహారంపై స్పందించిన విషయం తెలిసిందే. ఏ ప్రజాస్వామ్యానికైనా.. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాల్లాంటివని అగ్రరాజ్యం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది.

మోదీ ఇంటి పేరును కించపర్చారన్న కేసులో ఇటీవల రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై ఎగువ కోర్టులో సవాల్‌ చేసేందుకు ఆ పార్టీ న్యాయ నిపుణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పిటిషన్‌ను వారు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో సూరత్‌ సెషన్స్‌ కోర్టులో ఈ పిటిషన్‌ దాఖలయ్యే అవకాశముందని తెలుస్తోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు