
Fourth Dose: నాల్గో డోసుపై ఇజ్రాయెల్ అధ్యయనం.. ప్రపంచంలోనే మొదటిసారి!
జెరూసలెం: ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు బూస్టర్ డోసులపైనా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇజ్రాయెల్.. ఏకంగా నాలుగో డోసు ప్రభావంపై అధ్యయనం మొదలుపెట్టడం గమనార్హం. ప్రపంచంలోనే మొదటిసారిగా సోమవారం ఇక్కడి షెబా మెడికల్ సెంటర్‌లో పలువురికి నాల్గో డోసు వేశారు. ఈ పరీక్షల్లో భాగంగా మొత్తం ఆరు వేల మందికి నాల్గో డోసు ఇవ్వనున్నారు. అందులో 150 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. దేశంలో 60 ఏళ్లు పైబడిన వారికి, వైద్య సిబ్బందికి, వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నవారికి ఫోర్త్ డోస్ అందించాలని ఆరోగ్యశాఖ నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
యాంటీబాడీల స్థాయిలు, వైరస్ నిరోధకతపై నాల్గో డోసు ప్రభావాన్ని పరీక్షించేందుకు ఈ అధ్యయనం చేపడుతున్నట్లు షెబా మెడికల్ సెంటర్ ప్రతినిధి తెలిపారు. నాల్గో డోస్‌తో కలిగే అదనపు ప్రయోజనాలు, ఎవరికి అవసరం? సురక్షితమేనా? తదితర విషయాలు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. మరోవైపు అధికారిక వివరాల ప్రకారం.. దేశ జనాభాలో దాదాపు 63 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. దాదాపు 45 శాతం మంది మూడో డోస్ కూడా వేయించుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో వెయ్యి వరకు ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.