సీఎం వేదికపైకి ఏడాది బిడ్డను విసిరేసి.. ఆ తండ్రి ప్రవర్తన వెనక అంతులేని వేదన..!

Man throws his year old child: తన కుమారుడిని సీఎం కూర్చున్న వేదికపైకి విసిరి, ఓ తండ్రి వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. అతడలా ప్రవర్తించడానికి గల కారణాన్ని తెలుసుకున్న సీఎం తక్షణమే స్పందించారు. 

Updated : 16 May 2023 17:44 IST

భోపాల్: సీఎం దృష్టిలో పడేందుకు ఓ తండ్రి చేసిన చర్య అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసరడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే ఆ కన్నతండ్రి ప్రవర్తన వెనక కారణం తెలిస్తే మాత్రం హృదయం చలించకమానదు..! అసలు ఏం జరిగిందంటే..? (Man throws his year-old child)

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన ముకేశ్‌ పటేల్‌, నేహా భార్యభర్తలు. ముకేశ్‌ రోజువారీ కూలీ. ఆ జంటకు ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారికి మూడు నెలల వయస్సున్నప్పుడు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు గుర్తించారు. అప్పటినుంచి వైద్యం కోసం రూ.4లక్షల వరకు ఖర్చు చేశారు. ఇప్పటికే ముకేశ్ కుటుంబం స్థోమతకు మించి ఖర్చు చేసింది. ఇక ఆపరేషన్‌కు రూ.3.50లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో వారికి అర్థం కాలేదు. తమ గోడు ఎవరికి వినిపించాలో తెలీక సతమతమయ్యారు. 

అప్పుడే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌(Shivraj Singh Chouhan).. సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి ముకేశ్‌, నేహా కూడా వెళ్లారు. తమ సమస్యను ఎలాగైనా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని యత్నించారు. కానీ ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లడం వారికి సాధ్యపడలేదు. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ తండ్రి విపరీత చర్యకు పాల్పడ్డారు. వేదికపై సీఎం ప్రసంగిస్తోన్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను అక్కడకు విసిరేశాడు. ఆ చర్యతో అక్కడున్నవారు ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ పిల్లాడిని కాపాడి, తల్లికి అప్పగించారు. అసలు అతడి ప్రవర్తనకు గల కారణం గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. చిన్నారి సమస్య తెలుసుకున్న సీఎం.. వైద్య సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ వెంటనే స్థానిక కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే, తండ్రి చేసిన ఈ విపరీత చర్య పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహాయం అర్థించే పద్ధతి ఇది కాదని అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని