Afghanistan Crisis: 24-36 గంటల్లో మరో ఉగ్రదాడి: బైడెన్‌

రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబుల్‌ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం ఉందని తెలిపారు.....

Updated : 29 Aug 2021 11:00 IST

వాషింగ్టన్‌: రానున్న 24 నుంచి 36 గంటల్లో కాబుల్‌ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ మేరకు తమకు కచ్చితమైన సమాచారం లభించిందని తెలిపారు. సైనిక కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.

‘‘క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా భయానకంగానే ఉన్నాయి. కాబుల్‌ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. రానున్న 24-36 గంటల్లో మరో దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని కమాండర్లు నా దృష్టికి తీసుకొచ్చారు’’ అని బైడెన్ శనివారం తెలిపారు.

ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఉన్న సైనికులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బైడెన్ సైనిక ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే అఫ్గాన్‌లో ఉన్న అమెరికా పౌరులను రక్షించేందుకు కావాల్సిన అన్ని వసతులు, సహకారాలను అందించాలని సూచించారు. గురువారం నాటి దాడులకు కారణమైన ఐసిస్‌-కెపై మరిన్ని దాడులు జరుగుతాయని తేల్చి చెప్పారు. అమెరికాకు హాని తలపెట్టాలనుకుంటున్న వారిపై తప్పకుండా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.

కాబుల్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నప్పటికీ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని బైడెన్‌ ప్రకటించారు. దాదాపు 350 మంది అమెరికా పౌరులు ఇంకా అఫ్గానిస్థాన్‌లో ఉన్నారని తెలిపారు. అలాగే పౌర ప్రభుత్వంతో అమెరికా సేనలకు సహకరించిన అనేక మంది అఫ్గాన్‌ పౌరులు దేశాన్ని వీడేందుకు వేచి చూస్తున్నారన్నారు. శుక్రవారం 6,800 మందిని అఫ్గాన్‌ నుంచి తరలించామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని