Published : 01 Jul 2022 14:32 IST

Maharashtra: మెట్రో కార్‌షెడ్‌పైనే శిందే తొలి నిర్ణయం.. మాజీ బాస్‌ నిర్ణయం పక్కకు..!

ముంబయి: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే.. తన మాజీ బాస్‌ అయిన ఉద్ధవ్ ఠాక్రేకు గట్టి షాకే ఇవ్వబోతున్నట్లున్నారు. మెట్రో కార్‌షెడ్‌పై ఠాక్రే నిర్ణయాన్ని పక్కనబెట్టి.. ఆ ప్రాజెక్టును తిరిగి ఆరే కాలనీలోనే నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం రాత్రి జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో సీఎం శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆ దిశగా చర్యలు చేపట్టారు.

ప్రమాణస్వీకారం తర్వాత శిందే కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెట్రో కార్‌ షెడ్‌పై చర్చ జరిగింది. కంజూర్‌మార్గ్‌కు బదులుగా ఆరే కాలనీలోనే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని కొత్త ప్రభుత్వం ప్రతిపాదన చేస్తున్నట్లుగా కోర్టుకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ను ఫడణవీస్‌ ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆరే కాలనీలో చేపట్టాలని గతంలో ఫడణవీస్‌ ప్రభుత్వం నిర్ణయించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఠాక్రే దాన్ని ఆపేసింది. మెట్రో షెడ్‌ను ఆరే కాలనీ నుంచి కంజూర్‌మార్గ్‌కు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా శిందే ప్రభుత్వం మళ్లీ ఆరే కాలనీలోనే చేపట్టాలని ప్రతిపాదించడంతో ఠాక్రేకు షాకిచ్చినట్లయింది. దీంతో పాటు ఠాక్రే ప్రభుత్వం తీసుకొచ్చిన జలయుక్త్‌ శివిర్‌ పథకాన్ని కూడా నిలిపివేయాలని ఫడణవీస్‌ అధికారులను ఆదేశించారు. ఈ పథకంలో ఎంతో అవినీతి జరుగుతోందని, అందుకే దాన్ని నిలిపివేస్తున్నట్లు ఫడణవీస్‌ చెప్పినట్లు సమాచారం.

అసలేంటీ ప్రాజెక్టు వివాదం..

2019లో దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వ హయాంలో ఆరే కాలనీలో మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును నిర్మించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్.. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) అనుమతి కూడా తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆరే కాలనీలో వందలాది చెట్లను నరకాల్సి రావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పర్యావరణ కార్యకర్తలతో పాటు ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత భాజపాతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి మహా వికాస్‌ అఘాడీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే 2019 నవంబరులో సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెట్రో కార్‌ షెడ్‌పై ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్‌షెడ్‌ను ఆరే కాలనీ నుంచి కంజూర్‌మార్గ్‌కు తరలించారు. అంతేగాక, ఆరే కాలనీని రిజర్వ్‌ అటవీ ప్రాంతంగా ప్రకటించారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టును ఆశ్రయించింది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమని, రాష్ట్రంతో సంబంధం లేదని పేర్కొంది. దీంతో ఠాక్రే నిర్ణయంపై బాంబే హైకోర్టే స్టే విధించింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. తాజాగా భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే.. ఫడణవీస్‌ ఈ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts