Gulmarg: మంచుకొండల్లో జవాన్లకు మంచి మిత్రులుగా శునకాలు..!

జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లోని గుల్‌మార్గ్‌(Gulmarg)లో ఎల్‌వోసీ (LOC) వెంట మంచు కురిసే (Snow Fall) సమయాల్లో ఎత్తైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం భారత సైన్యానికి (Indian Army) సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. 

Published : 04 Mar 2023 01:46 IST

గుల్‌మార్గ్‌: ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహించే వారికి ప్రకృతే ప్రధాన శత్రువు. అయినా తట్టుకొని.. దేశంలోకి శత్రు మూకలు చొరబడకుండా నిరంతరం పహారా కాస్తుంటారు. ఓవైపు ప్రకృతితో పోరాడుతూనే.. శత్రువు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి వారికి స్థానికంగా ఉండే శునకాలే (Dogs) మిత్రులుగా ఉంటూ వారికి  మంచి మిత్రులుగా ఉపయోగపడుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir)లోని గుల్‌మార్గ్‌(Gulmarg)లో నియంత్రణ రేఖ (LOC) వెంట మంచు కురిసే (Snow Fall) సమయాల్లో ఎత్తైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం భారత సైన్యానికి (Indian Army) సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. ఆ సమయంలో స్థానికంగా ఉండే వీధి శునకాలే ముందస్తుగా స్పందించి సైనికులకు హెచ్చరిక వ్యవస్థలుగా పని చేస్తున్నాయి. 

‘‘స్థానికంగా ఉండేవారికి అవి సాధారణ శునకాలే. ఎల్‌వోసీ వెంట పెట్రోలింగ్ చేసే సైన్యంతోపాటు అవి కూడా తిరుగుతుంటాయి. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే వాటి స్పందనలే మాకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు. అవి మాకు ఎంతో సాయం చేస్తాయి. ఇవి ఈ రోజు మాతో ఉంటాయి. రేపు మరో యూనిట్‌తో కలిసి నడుస్తాయి. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా, సైనికులకు అవే దారి చూపుతాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మాతోపాటు సైనిక స్థావరాల వరకు వచ్చేస్తాయి. కాలినడకన మాత్రమే చేరుకోగలిగే ఈ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. వాటికి ఆహారం కూడా పెద్దగా లభించదు. కొన్నిసార్లు సైనికులు తమ కోసం తెచ్చుకున్న బిస్కెట్లు, నీరును వాటితో పంచుకుంటారు’’ అని ఓ సైనికుడు చెప్పాడు. 

భారత సైన్యం 19 ఇన్ఫాంటరీ డివిజన్‌ కమాండింగ్ ఆఫీసర్‌ మేజర్‌ జనరల్‌ అజయ్‌ చంద్‌ పురియా మాట్లాడుతూ.. ‘‘సైనికులు, శునకాల మధ్య  స్నేహం అసాధారణమైందేమీ కాదు. అవి మనిషిని మంచి స్నేహితుడిగా భావిస్తాయి. మరీ ముఖ్యంగా శీతాకాలం (Winter)లో.. సైనికులకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, మంచు ఎక్కువగా పడుతున్న సందర్భాల్లో సైనికులకు అవి మంచి తోడుగా నిలుస్తాయి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని