Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ

బాల్య వివాహాలు చేసుకున్న వారిని రేపటి నుంచి అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. దాదాపు 4000 మందిపై విచారణ జరుగుతోందని చెప్పారు.

Published : 02 Feb 2023 23:48 IST

గువాహటి: బాల్య వివాహాలపై అస్సాం (Assam) ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ.. 14 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma) శుక్రవారం నుంచే అరెస్టులు మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 4000 మందిపై విచారణ జరుగుతోందని చెప్పారు. ‘‘ బాల్య వివాహాలకు పాల్పడిన వేలాది మందిని రేపటి నుంచి అరెస్టు చేస్తున్నాం. ఆరేడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మైనర్‌ బాలికలను గతంలో పెళ్లి చేసుకున్నా, వివాహం చేసుకోవాలని నిర్ణయించినా కచ్చితంగా అరెస్టు చేస్తాం’’ అని హిమంత బిశ్వశర్మ మీడియాకు తెలిపారు.

బాల్యవివాహాలు, మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని ఇటీవల అస్సాం కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. అరెస్టులపై ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సీఎం.. తాజాగా కార్యాచరణ మొదలుపెట్టారు. దీనిని రాజకీయం చేయొద్దని, కేవలం బాల్యవివాహాలపై జరుగుతున్న యుద్ధంగానే భావించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు జరిపించిన మతపెద్దలు, పురోహితులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దూబ్రీ జిల్లాలో అత్యధికంగా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 31 శాతం వివాహాలు తక్కువ వయసులోనే జరగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని