Crowd funding: కిడ్నాపర్లకు డబ్బు చెల్లించేందుకు ఊరంతా ఏకమై..!

అపహరణకు గురైన తమ ముగ్గురు గ్రామస్థులను విడిపించేందుకుగానూ ఏకంగా ఓ గ్రామమే నగదు సేకరణకు కదిలింది. మధ్యప్రదేశ్‌లోని శ్యోపుర్‌ జిల్లాలో ఇది వెలుగుచూసింది.

Published : 21 Jan 2023 01:42 IST

భోపాల్‌: కిడ్నాపర్ల చెర నుంచి తమవారిని విడిపించుకునేందుకుగానూ.. ఏకంగా ఓ గ్రామమే నగదు సేకరణ(Crowdfunding)కు కదిలింది. మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని శ్యోపుర్(Sheopur) జిల్లాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. గ్రామస్థులు, పోలీసుల వివరాల ప్రకారం ఇక్కడి ఓ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. రామ్‌స్వరూప్ యాదవ్, భట్టు బఘేల్, గుడ్డా బఘేల్‌లు నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయారు. అయితే, వారిని పొరుగున ఉన్న రాజస్థాన్‌(Rajasthan)లోని ఓ నేరస్థుల ముఠా కిడ్నాప్ చేసినట్లు తేలింది. రూ.15 లక్షలు చెల్లిస్తే విడిచిపెడతామని కిడ్నాపర్లు చెప్పారు. అయితే, బాధితులంతా పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో.. అవసరమైన నగదు కోసం గ్రామస్థులే రంగంలోకి దిగారు.

‘మా వద్ద భూమి లేదు. పెద్దగా డబ్బూ లేదు. రూ.100.. రూ.200.. ఇలా తలో చెయ్యి వేస్తూ.. నగదు సేకరిస్తాం. తద్వారా కిడ్నాపర్లకు డబ్బు చెల్లించి, మా వారిని కాపాడుకుంటాం’ అని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ‘మా గ్రామంలో పేద కుటుంబాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ మంది పశుపోషకులే. కిడ్నాప్ అయిన రైతుల్లో ఒకరి ఇంటికి సరైన పైకప్పు కూడా లేదు. అటువంటప్పుడు.. ఈ కుటుంబాలు రూ.15 లక్షలు ఎలా చెల్లిస్తాయి? కాబట్టి అంతా కలిసి డబ్బు కూడబెడుతున్నాం’ అని మాజీ సర్పంచి సియారామ్ బఘేల్ చెప్పారు. రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాంనివాస్‌ రావత్‌ బాధిత కుటుంబాలను పరామర్శించారు.

మరోవైపు.. కిడ్నాపర్లను పట్టుకునేందుకు స్థానిక పోలీసులు, రాజస్థాన్‌ పోలీసులతో కలిసి గాలింపు ముమ్మరం చేశారు. ‘కిడ్నాపర్ల గురించి సమాచారం తెలిపినవారికి ఇప్పటికే రూ.10 వేల రివార్డు ప్రకటించాం. దాన్ని ఇప్పుడు రూ.30 వేలకు పెంచాం’ అని శ్యోపుర్ ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్- చంబల్ ప్రాంతంలో దోపిడీ ముఠాల ప్రాబల్యం ఎక్కువ. ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో.. కొన్ని రాజస్థాన్‌నుంచీ ఇక్కడ నేర కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. కొన్ని నెలల క్రితం కూడా శ్యోపుర్ జిల్లాకు చెందిన రైతును ఓ ముఠా కిడ్నాప్ చేయగా.. డబ్బులు చెల్లించిన అనంతరం విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని