Tatkal tickets: దేశం ఆపత్కాలంలో.. రైల్వే ‘తత్కాల్‌’ లాభాల్లో..!

కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టిముట్టిన తొలి ఏడాది దేశవ్యాప్తంగా రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని నెలల తర్వాతే తిరిగి ప్రారంభమయ్యాయి. అవి కూడా క్రమ క్రమంగానే అందుబాటులోకి వచ్చాయి.

Published : 02 Jan 2022 23:45 IST

దిల్లీ: కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టిముట్టిన తొలి ఏడాది దేశవ్యాప్తంగా రైల్వే సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని నెలల తర్వాతే తిరిగి ప్రారంభమయ్యాయి. అవి కూడా క్రమ క్రమంగానే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. అయితే, కొవిడ్‌ దేశంలోకి అడుగుపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో రైళ్లు అడపాదడపా అందుబాటులో ఉన్నప్పటికీ.. తత్కాల్‌ టికెట్ల రూపంలో మాత్రం రైల్వేకు భారీగానే ఆదాయం సమకూరడం గమనార్హం. ఆ ఏడాది తత్కాల్‌ టికెట్ల రూపంలో రూ.403 కోట్లు, ప్రీమియం తత్కాల్‌ టికెట్ల రూపంలో రూ.119 కోట్లు, డైనమిక్‌ ఫేర్స్‌ రూపంలో రూ.511 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ దాఖలు చేసిన ఆర్‌టీఐ దరఖాస్తుకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22 సెప్టెంబర్‌ వరకు) డైనమిక్‌ ఫేర్స్‌ రూపంలో రూ.240 కోట్లు, తత్కాల్‌ టికెట్ల రూపంలో రూ.353 కోట్లు, ప్రీమియం తత్కాల్‌ ఛార్జీల రూపంలో మరో రూ.89 కోట్లు వచ్చినట్లు రైల్వే శాఖ పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. అంటే ఎలాంటి ఆంక్షలు లేని వేళ డైనమిక్‌ ఫేర్స్‌ రూపంలో రూ.1313 కోట్లు ఆదాయం రైల్వేకు సమకూరింది. అలాగే రూ.1669 కోట్లు తత్కాల్‌ టికెట్ల రూపంలో, రూ.603 కోట్లు ప్రీమియం తత్కాల్‌ టికెట్ల రూపంలో సమకూరినట్లు రైల్వే శాఖ తెలిపింది.

చివరి నిమిషంలో అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సిన వారు.. ఈ మూడు కేటగిరీల కింద అధిక ఛార్జీలు చెల్లించి రైళ్లలో ప్రయాణించొచ్చు. అయితే, తత్కాల్‌ పేరిట రైల్వే శాఖ ప్రజల పేరిట భారం మోపడం సమర్థనీయం కాదని ఇటీవలే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ అభిప్రాయంపడింది. దీనివల్ల చివరి నిమిషంలో ప్రయాణించే సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొంది. ప్రయాణ దూరాన్ని బట్టి తత్కాల్‌ ఛార్జీలు ఉండాలని అభిప్రాయపడింది. ఫ్లెక్సీ లేదా డైనమిక్‌ ప్రైసింగ్‌ వల్ల రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లలో ఛార్జీలు బడ్జెట్‌ విమాన టికెట్‌ ధరలను మించిపోతున్నాయని పేర్కొంది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) తొలి ఆరు నెలల్లోనే టికెట్‌ తీసుకున్నప్పటికీ వెయిటింగ్‌ లిస్ట్‌ జాబితా కారణంగా ఆటో క్యాన్సిల్‌ అవ్వడంతో 53 లక్షల మంది ప్రయాణాలు చేయలేకపోయారని ఈ డేటా వెల్లడిస్తోంది. కొత్త రైళ్లు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2019-20లో కొత్తగా 144 రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ.. 2018-19లో 266; 2017-18లో 170; 2016-17లో 223 కొత్త రైళ్లను ప్రకటించింది. 2020-21లో కొత్తగా ఒక్క రైలు కూడా ప్రకటించకపోవడం గమనార్హం. కొత్త రైళ్లు లేక.. ఉన్నవి సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని