‘మా రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏదీ జరగదు’.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

కొంత మొత్తాన్ని కమీషన్‌గా ఇస్తేనేగానీ ఉత్తరాఖండ్‌లో ఎవరికీ ఏ పనీ జరగదంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

Published : 14 Nov 2022 12:41 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏ పని జరగదంటూ ఆయన మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర భాజపా సర్కారును ఇరుకునపడేసింది.

ఆ వీడియోలో తీరత్‌ సింగ్ ఓ గదిలో కూర్చుని రాష్ట్రంలోని ‘కమీషన్‌ఖోరి’ గురించి మాట్లాడారు. ‘‘నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. బహుశా ఇలాంటివి చెప్పకూడదేమో. కానీ ఉత్తరాఖండ్‌లో కమీషన్లు ఉన్నాయని నేను నిస్సందేహంగా అంగీకరిస్తాను. మా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపోయే సమయంలో ప్రజా పనులు జరగాలంటే 20శాతం వరకు కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవి తగ్గాల్సింది. కానీ, ఆ ప్రాక్టీస్‌ కొనసాగడమే గాక.. కమీషన్లు 20శాతం నుంచి ప్రారంభమయ్యాయి. కొంత మొత్తాన్ని కమీషన్‌గా ఇస్తేనేగానీ ఉత్తరాఖండ్‌లో ఎవరికీ ఏ పనీ జరగదు. దీనికి ఫలానా వారే బాధ్యులని నేను చెప్పలేను. కానీ ఇదో అలవాటుగా మారింది. మన రాష్ట్రాన్ని మన కుటుంబంలా చూసినప్పుడే ఇది పోతుంది’’ అని తీరత్‌ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఎప్పటిది అని స్పష్టంగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌లలో ప్రస్తుతం భాజపానే అధికారంలో ఉంది. దీంతో తీరత్‌ వ్యాఖ్యలు కాషాయ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే, కర్ణాటకలో కమీషన్‌ సర్కారు అంటూ కాంగ్రెస్‌ పార్టీ భాజపాపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. పేసీఎం, పేపీఎం అంటూ హస్తం పార్టీ.. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, ప్రధాని మోదీపై వంగ్యాస్త్రాలు గుప్పిస్తోంది.

ఇదిలా ఉండగా.. మాజీ సీఎం తీరత్‌ సింగ్‌ రావత్‌ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది మార్చిలో ఆయన సీఎం పదవి చేపట్టిన కొద్ది రోజుల తర్వాత మహిళల వస్త్రధారణపై తీరత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇద్దరు పిల్లల తల్లై ఉండీ ఒకావిడ చిరిగిన జీన్స్‌ వేసుకుందని, అలాంటావిడ సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత ఓసారి అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ తీరత్‌ విమర్శలపాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని