Lucknow: అందుకే 22 సార్లు కొట్టాను

ఓ యువతి నడిరోడ్డుపై క్యాబ్‌ డ్రైవర్‌ను కారులోంచి లాగి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టింది

Updated : 06 Aug 2021 20:20 IST

క్యాబ్‌ డ్రైవర్‌ చెంప దెబ్బ ఘటనలో ట్విస్ట్‌

లఖ్‌నవూ: ఓ యువతి నడిరోడ్డుపై క్యాబ్‌ డ్రైవర్‌ను కారులోంచి లాగి 22 సార్లు చెంపదెబ్బలు కొట్టింది. క్యాబ్‌ తనను ఢీకొట్టబోయిందనే కారణంతో డ్రైవర్‌ చెంపలపై ఎడాపెడా వాయించింది. కొద్ది రోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే..?

లఖ్‌నవూలో వాహనాలు రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రియదర్శిని అనే యువతి రోడ్డు దాటుతుంది. ఆ సమయంలో సాదత్ అలీ సిద్ధిఖీ అనే వ్యక్తి క్యాబ్‌ నడుపుకుంటూ తనకు అతి సమీపంగా వచ్చాడు. అంతే.. కారు తనను ఢీకొట్టబోయిందని అతనిని క్యాబ్‌ నుంచి లాగి మరీ అతనిపై చేయి చేసుకుంది. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపైనా తన చేతివాటం ప్రదర్శించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడి అశాంతికి భంగం కలిగించారంటూ క్యాబ్‌ డ్రైవర్‌ సిద్ధీఖీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రియదర్శిని స్పందిస్తూ.. ‘క్యాబ్ డ్రైవర్ కారును జీబ్రా క్రాసింగ్ మీదకు పోనిచ్చాడు. ఇది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడం కాదా? సీసీటీవీ ఫుటేజీని పరిశీలించండి. తప్పెవరిదో తేల్చండి. ఒకవేళ నేను చనిపోయి ఉంటే.. పోస్టుమార్టం చేసి నా డెడ్‌బాడీని ఇంటికి పంపించేవారా..?’ అని వాపోయింది.

క్యాబ్ డ్రైవర్ ఏమన్నాడంటే..?

‘ఆమె కార్లో నుంచి నా ఫోన్‌ను లాగేసుకుంది. దాన్ని ముక్కముక్కలుగా పగలగొట్టింది. కారు సైడ్ అద్దాలను పగలగొట్టింది.  నా జేబులోంచి రూ.600 లాక్కుంది. నేను ఎలాంటి ట్రాఫిక్‌ నియామాలను ఉల్లంఘించలేదు. అయినా పోలీసులు నాపై కేసు నమోదు చేశారు. నాకు 24 గంటలపాటు ఆహారం పెట్టలేదు. ఆ మహిళ చెప్పిందే విన్నారు, కానీ నా మాట ఎవరూ వినిపించుకోలేదు. నేనో పేద కుటుంబానికి చెందిన క్యాబ్ డ్రైవర్‌ను. నాకు న్యాయం కావాలి’ అని గోడు వెల్లబుచ్చుకున్నాడు.

బయటపడ్డ అసలు నిజం..

వీడియో, సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాకే అసలు నిజం బయటపడింది. ఆ యువతే ప్రమాదకర రీతిలో రోడ్డును దాటుతూ కనిపించింది. ఇంత హల్‌చల్‌ సృష్టించి క్యాబ్‌ డ్రైవర్‌ను చెంప దెబ్బలు కొట్టిన యువతిదే చివరికి తప్పని తేలింది. దీంతో సోషల్ మీడియాలో ‘అరెస్ట్ లఖ్‌నవూ గర్ల్’ అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు చేశారు. పోలీసులపై ఒత్తిడి పెరిగిపోవడంతో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ తర్వాత ఆమె అందరికీ అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చింది. ‘పోలీసులు నా దగ్గరికీ వచ్చారు. మా కుటుంబ సభ్యులను వేధించారు. వారి వద్ద నా ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. నాపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవి. నేను తనని ఊరికే కొట్టలేదు.. ఆత్మరక్షణ కోసం మాత్రమే  చేయి చేసుకున్నాను’ అంటూ తన తప్పును సమర్థించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు