Yogi Adityanath: యోగి 2.0 ప్రభుత్వం.. తొలి నిర్ణయమిదే..

వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా కొలువుదీరిన యోగి ఆదిత్యనాథ్.. ప్రజల సంక్షేమం కోసమే తన ప్రభుత్వమని చాటుకున్నారు. మరో మూడు నెలల పాటు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించారు.

Published : 26 Mar 2022 14:00 IST

లఖ్‌నవూ: వరుసగా రెండోసారి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఉందని చాటుకున్నారు. మరో మూడు నెలల పాటు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించారు. 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి, నిన్న ప్రమాణ స్వీకారం చేసిన యోగి అధ్యక్షతన శనివారం లఖ్‌నవూలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మార్చి 31 నుంచి జూన్ 30 వరకూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కొత్త కెబినెట్ తీసుకున్న మొదటి నిర్ణయం. దీనిని మేం పారదర్శకంగా అమలు చేస్తాం’ అని యోగి వెల్లడించారు. 2020లో కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టిన సమయంలో.. దేశ ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం ఈ ఉచిత రేషన్‌ను ప్రారంభించింది.

ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సహా భాజపాకు చెందిన పలువురు అతిరథ మహారథుల సమక్షంలో రాష్ట్రంలో యోగి సర్కారు 2.0 శుక్రవారం కొలువుదీరింది. 52 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ కమలదళం సీనియర్‌ నేత కేశవ్‌ప్రసాద్‌ మౌర్యకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. ఆయనతో పాటు మరో సీనియర్‌ నాయకుడు బ్రజేశ్‌ పాఠక్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని