Supreme Court: ప్రధానిపైనా చర్యలు తీసుకోగలిగే సీఈసీ కావాలి.. సుప్రీంకోర్టు

సీఈసీ, ఈసీల నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రెండోరోజు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన వ్యక్తులను సీఈసీగా నియమిస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Published : 24 Nov 2022 02:06 IST

దిల్లీ: ప్రస్తుత వ్యవస్థలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. తమకు అనుగుణంగా వ్యవహరించే వ్యక్తినే సీఈసీగా నియమిస్తుందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారిని రాజకీయ పార్టీల ప్రభావం నుంచి దూరంగా ఉంచాలని, అప్పుడే స్వతంత్రంగా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలంటే.. ప్రధాన ఎన్నికల అధికారి నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

సీఈసీ, ఈసీల నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కూడా విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. 1991 చట్టం ప్రకారం జీతాలు, పదవీకాలాల విషయంలో ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగానే ఉందని తెలిపారు. సీఈసీ నియామక ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిగ్గానే ఉందని, ఇందులో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీనియర్‌ అధికారుల జాబితాను ఎంపిక చేసి.. దాన్ని న్యాయశాఖకు.. ఆ తర్వాత ప్రధానికి పంపుతామని తెలిపారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఈ వ్యవస్థ సరిగా లేదని మేం చెప్పడం లేదు. అయితే ఓ పారదర్శక ప్రక్రియ అవసరం’’ అని అభిప్రాయపడింది. అంతేగాక, ఎప్పుడూ సివిల్‌ సర్వెంట్లను ఎందుకు ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్నారని ప్రశ్నించింది. దీనికి ఏజీ బదులిస్తూ.. ‘‘ఇది సంప్రదాయంగా వస్తోంది. దాన్ని మేం ఎలా పాటించకుండా ఉంటాం. ఈ పదవి కోసం జాతీయ స్థాయిలో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదు’’ అని తెలిపారు.

ప్రధానిపై.. సీఈసీ చర్యలు తీసుకోగలరా?

అయితే కేంద్రం వాదనపై రాజ్యాంగ ధర్మాసనం పెదవివిరిచింది. ఎన్నికల కమిషన్‌ స్వతంత్రంగా పనిచేయాలంటే.. కింది స్థాయి నుంచే పారదర్శక నియామక ప్రక్రియ ఉండాలని సూచించింది. ‘‘ఇప్పుడున్న రోజుల్లో కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలనుకుంటోంది. ఇక, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ప్రభుత్వం కూడా అన్ని విషయాల్లో తమకు ‘యస్‌’ అంటూ తలూపే వ్యక్తినే ఎన్నికల కమిషన్‌ చీఫ్‌గా నియమిస్తోంది. అప్పుడు అది స్వతంత్ర సంస్థ ఎలా అవుతుంది? ఉదాహరణకు.. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఏమైనా ఆరోపణలు వచ్చాయనుకోండి..! అప్పుడు ప్రభుత్వం నియమించిన సీఈసీ.. ప్రధానిపై చర్యలు తీసుకోగలరా? తీసుకోలేరు. అది వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు కాదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమైతే ప్రధానిపై చర్యలు తీసుకునే సీఈసీ కావాలి. అందుకే, కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నియామకం కోసం సమ్మిళిత ప్రక్రియ అవసరం. ఈ నియామకం కోసం ఏర్పాటు చేసే కమిటీలో సీజేఐను కూడా సభ్యుడిగా చేర్చాలి’’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.

గోయల్‌ నియామక పత్రాలు తీసుకురండి..

ఇక, ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ తాజా నియామకాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండగా ఆ నియామకం ఎలా చేపట్టారని ప్రశ్నించింది. గోయల్‌ నియామకానికి సంబంధించిన పత్రాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈసీ, సీఈసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు 72 ఏళ్లుగా చట్టం తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించింది. సీఈసీ, ఈసీ నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని