
Priyanka Gandhi: ‘లఖింపుర్ ఘటనపై స్వతంత్ర విచారణ అవసరమని స్పష్టమవుతోంది’
దిల్లీ: లఖింపుర్ ఖేరి ఘటన విచారణలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదని సుప్రీం కోర్టు నేడు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ కేసులో స్వతంత్ర విచారణ అవసరమని పేర్కొన్నారు. ‘లఖింపుర్ కేసులో రైతులపై వాహనం ఎక్కించిన వారికి యూపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. ప్రధాన నిందితుడి తండ్రి(కేంద్ర మంత్రి)కి ప్రధాని నరేంద్ర మోదీ అభయం ఉంది. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను గమనిస్తే.. ఈ కేసులో న్యాయం కోసం స్వతంత్ర విచారణ చేపట్టాల్సిన అవసరముంద’ని స్పష్టమవుతోందన్నారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు.
అంతకుముందు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ కేసు విచారణ విషయంలో యూపీ ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎంతమందిని ఏయే ఆరోపణలతో అరెస్టు చేశారో సంబంధిత నివేదికలో వెల్లడించాలని ఆదేశించారు. గత నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో ప్రదర్శనగా వెళ్తున్న రైతులపై వాహన శ్రేణి దూసుకెళ్లడం, ఆ తరువాతి ఘటనల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే.