Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై దర్యాప్తునకు ఐరాస కమిటీ.. ఓటింగ్‌కు భారత్‌ దూరం..!

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు ఓ ఉన్నత స్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని

Published : 04 Mar 2022 18:08 IST

యునైటెడ్‌ నేషన్స్‌: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై దర్యాప్తు చేపట్టేందుకు ఓ ఉన్నత స్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్ణయించింది. ఇందుకోసం నేడు ఓటింగ్‌ నిర్వహించగా.. భారత్‌ దీనికి కూడా దూరంగా ఉండటం గమనార్హం. 

‘‘ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్రపై ఓ స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘం నిర్ణయించింది’’ అని యూఎన్‌హెచ్‌ఆర్‌సీ వెల్లడించింది. దీనిపై నేడు సమావేశమైన కౌన్సిల్‌.. ఉక్రెయిన్‌లో మానవ హక్కుల పరిస్థితులపై దర్యాప్తు చేపట్టేందుకు ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 47 సభ్యులున్న కౌన్సిల్‌లో ఈ తీర్మానానికి అనుకూలంగా 32 దేశాలు ఓటేశాయి. వీటిల్లో అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, నేపాల్‌, జపాన్‌, యూకే, యూఏఈ వంటి దేశాలున్నాయి. రష్యా, ఎరిట్రియా వ్యతిరేకించాయి. భారత్‌, చైనా, పాకిస్థాన్‌ సహా 13 దేశాన్ని ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. 

రష్యా దురాక్రమణపై ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా మూడు తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటికి కూడా భారత్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ గతవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. ఇక ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై కూడా భారత్‌ దూరంగానే ఉంది. సర్వప్రతినిధి సభలో ఈ తీర్మానానికి అనుకూలంగా 141 దేశాలు ఓటువేశాయి. ఐదు దేశాలు వ్యతిరేకించాయి. భారత్‌ సహా 35 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని