Vaccination: భారత్‌ మరో రికార్డు.. 13 రోజుల్లోనే 10 కోట్ల డోసులు

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల డోసులు పంపిణీ చేసి తన సత్తాను ......

Published : 07 Sep 2021 16:38 IST

దిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 13 రోజుల్లోనే 10 కోట్ల డోసులు పంపిణీ చేసి తన సత్తాను మరోసారి రుజువు చేసుకుంది. కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమైన భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఇప్పటివరకు 70 కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌మాండవీయ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ అపూర్వ ఫీట్‌ను సాధించడంలో కీలకంగా వ్యవహరించిన ఆరోగ్యరంగ కార్యకర్తలు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. 

మరోవైపు, వ్యాక్సిన్‌ లభ్యత పెరుగుతుండటంతో గత కొన్ని రోజులుగా రోజుకు దాదాపు కోటి డోసులు పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తర్వాత తొలి 10 కోట్ల డోసుల పంపిణీకి 84 రోజుల సమయం పట్టగా.. ఆ తర్వాత క్రమంగా వేగం మరింత ఊపందుకొంది. 10 కోట్ల డోసుల నుంచి 20 కోట్లకు చేరేందుకు 45 రోజుల సమయం పట్టగా.. 20-30 కోట్లకు 29 రోజులు, 30-40 కోట్లకు 24 రోజులు, 40- 50 కోట్లకు 20 రోజులు, 50-60 కోట్లకు 19 రోజులు, 60 నుంచి 70 కోట్ల మైలురాయి చేరేందుకు  కేవలం 13 రోజుల సమయం పట్టిందని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని