USA: భారత్‌-చైనా టెన్షన్లు తగ్గాలంటే సమష్టి ప్రయోజనాలను గుర్తించాలి: అమెరికా

జిన్‌పింగ్‌ సర్కారు పొరుగు దేశాలతో సమస్యల పరిష్కారం విషయంలో ఎటువంటి పట్టువిడుపు ధోరణులు ప్రదర్శించడం లేదని అమెరికా విమర్శించింది.

Published : 13 Jun 2024 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్: చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకొనే అంశంలో భారత్‌ పురోగతి సాధించాలని అమెరికా ఆకాంక్షిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగశాఖ ఉప మంత్రి కర్ట్‌ క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌తో అమెరికా సంబంధాలు మెరుగుపర్చడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు పెరుగుతున్న చైనా శక్తిని న్యూదిల్లీతో కలిసి వాషింగ్టన్‌ ఎదుర్కొనే వ్యూహాన్ని కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘ఏదో ఒక సమయంలో ఇరు దేశాలు (భారత్‌, చైనా) కలిసి పనిచేసేందుకు వీలుగా సమష్టి ప్రయోజనాలను గుర్తిస్తాయి. ఇది ఉద్రిక్తతలు తగ్గేందుకు దోహదం చేస్తుంది. మేం వాటికి కచ్చితంగా మద్దతు ఇస్తాం. భారత్‌ చర్చలు ఫలవంతం కావాలని కోరుకుంటున్నా. భారత్‌-చైనా మధ్య కొన్ని వ్యవస్థీకృత సమస్యలున్నాయి.. అవి పరిష్కారానికి అడ్డం పడుతున్నాయి. ప్రాదేశిక అంశాల్లో జిన్‌పింగ్‌ సర్కారు ఎక్కడా పట్టువిడుపు ధోరణి చూపడం లేదు. ఈ క్రమంలో సమష్టిగా పనిచేసే అవకాశం కూడా లభించడం లేదు. ఇక భారత్‌తో సంబంధాల విషయంలో వాషింగ్టన్‌ చాలా విశ్వాసంగా.. సౌకర్యవంతంగా ఉంది. ఈ బంధంలో మరింత పురోగతి ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సలీవాన్‌తో కలిసి క్యాంప్‌బెల్‌ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. మరిన్ని రంగాల్లో ఇరుదేశాల సహకారంపై ఈ సందర్భంగా చర్చలు జరగనున్నాయి. 

బుధవారం మన విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ భారత్‌-చైనా మధ్య ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. ఇది సుదీర్ఘకాలంగా ఇరుదేశాల సంబంధాలను దెబ్బతీస్తోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా క్యాంప్‌బెల్‌ స్పందించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని