LAC: 20 మందికిపైగా భారత సైనికులకు గాయాలంటూ నివేదికలు..!

భారత్‌-చైనా దళాల మధ్య  జరిగిన ఘర్షణలో క్షతగాత్రుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వస్తున్నాయి.

Updated : 13 Dec 2022 13:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డిసెంబర్‌ 9వ తేదీన అరుణాచల్‌ ప్రదేశ్‌(arunachal pradesh)లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ చోటు చేసుకుని ఇరుపక్షాల సైనికులు గాయపడ్డారు. భారత(India) సైన్యం ఈ అంశంపై ప్రకటన విడుదల చేసినా.. క్షతగాత్రుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. తొలుత ఆరుగురు సైనికులు గాయపడ్డారంటూ నివేదికలు వెలువడగా.. తాజాగా ఆ సంఖ్య 20కి పైగా ఉంటుందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. క్షతగాత్రుల సంఖ్య భారత్‌ కంటే చైనా (china)వైపు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌(India)కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌(arunachal pradesh) వద్ద సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2021 అక్టోబర్‌లో కూడా పెట్రోలింగ్‌ విషయంలో భారత్‌(India)-చైనా(china) సేనలు ఘర్షణ పడ్డాయి. మరోవైపు భారత వాయుసేన అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద యాక్టివ్‌ కాంబాట్‌ పెట్రోల్స్‌ను (యుద్ధవిమానాలతో గస్తీ) మొదలుపెట్టింది. చైనా వాయుసేన కదలికలను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వాయుసేన వర్గాలు పేర్కొన్నాయి.

యుద్ధ్‌ అభ్యాస్‌ ముగిసిన వారంలోపే..!

భారత్‌-అమెరికా సేనలు ఈ ఏడాది సంయుక్త సైనిక శిక్షణ కార్యక్రమం ‘యుద్ధ్‌ అభ్యాస్‌-2022’ను నవంబర్‌ 17 నుంచి డిసెంబర్‌ మొదటి వారం వరకు నిర్వహించాయి. చైనా (china) సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్‌ పర్వత శిఖరాలపై ఔలీలో వీటిని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సైనికులకు అమెరికా అదే సమయంలో ప్రమోషన్లు కూడా ఇచ్చింది. డిసెంబర్‌ 2వ తేదీన ఈ కార్యక్రమం ముగిసింది. ‘యుద్ధ్‌ అభ్యాస్‌-2022’ను ఉత్తరాఖండ్‌లో నిర్వహిస్తున్నామని భారత్ ప్రకటించిన తర్వాత చైనా(china) పలు మార్లు తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చైనా(china) విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ నవంబర్‌ 30న మాట్లాడుతూ.. సరిహద్దు ఒప్పందాలను భారత్‌(India) ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘‘వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు సమీపంలో నిర్వహిస్తున్న విన్యాసాలు.. 1993, 1996లో భారత్‌-చైనాల మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే’’ అని పేర్కొన్నారు. భారత్‌ (India) ఈ విషయంపై తీవ్రంగా స్పందించింది. ‘‘ఎవరితో కలిసి యుద్ధవిన్యాసాలు చేయాలో భారత్‌(India)కు మూడో దేశం చెప్పాల్సిన అవసరం లేదు. ద్వైపాక్షిక ఒప్పందాలతో ఈ విన్యాసాలకు సంబంధం లేదు’’ అని  విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ పేర్కొన్నారు. మరోవైపు భారత్‌-చైనా వ్యవహారాల్లో తల దూర్చొద్దని అమెరికాను కూడా డ్రాగన్‌ హెచ్చరించింది.

భారీ సంఖ్యలో పీఎల్‌ఏ దళాలు పెట్రోలింగ్‌కు

ఇటీవల కాలంలో చైనా(china) సైన్యం భారీ సంఖ్యలో దళాలను పెట్రోలింగ్‌కు పంపుతోంది. పెట్రోలింగ్‌  చేసే ప్రదేశాలు చైనావే అని వెల్లడించేందుకు ఇలా చేస్తోంది. గత కొన్నేళ్లలో చైనా (china)చొరబాట్లు ఎల్‌ఏసీ పశ్చిమ సెక్టార్‌లోనే ఎక్కువగా చోటు చేసుకొన్నాయి. కానీ, మధ్య, తూర్పు సెక్టార్లలో కూడా ఇటీవల కాలంలో మెల్లగా పెంచుతోంది. వాస్తవాధీన రేఖ పశ్చిమ (లద్దాఖ్‌), మధ్య (హిమాచల్‌, ఉత్తరాఖండ్‌) సిక్కిం, తూర్పు (అరుణాచల్‌ప్రదేశ్‌) సెక్టార్లుగా విభజితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని