BSF: బీఎస్‌ఎఫ్‌ జవాన్లపై స్మగ్లర్ల దాడి.. ఎదురుదాడిలో ఒకరు హతం

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో స్మగ్లర్లు బరితెగించారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భద్రతా దళాలపై దాడులకు తెగబడ్డారు.

Published : 06 Jun 2022 01:31 IST

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఘటన

కోల్‌కతా: భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో స్మగ్లర్లు బరితెగించారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భద్రతా దళాలపై దాడులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు జరిపిన ప్రతిదాడుల్లో ఒక స్మగ్లర్‌ హతమైనట్లు బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి పశువులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలు ఎక్కువైనట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

పశ్చిమబెంగాల్‌ ముర్షీదాబాద్‌ జిల్లాలోని బంగ్లాదేశ్‌ సరిహద్దులో స్మగ్లరు సంచరిస్తున్నట్లు బీఎస్‌ఎఫ్‌ నిఘా విభాగం గుర్తించింది. దీంతో సరిహద్దు వెంట జవాన్ల గస్తీని ముమ్మరం చేసింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో 10 నుంచి 15 మంది సభ్యులు కలిగిన స్మగ్లర్ల బృందం జవాన్లపై దాడులకు తెగబడ్డారు. రాళ్లు, పదునైన ఆయుధాలతో దాడికి దిగగా.. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ప్రతిదాడులు మొదలుపెట్టారు. తొలుత వారిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ రక్షణాత్మక చర్యల్లో భాగంగా జవాన్‌లు జరిపిన కాల్పుల్లో ఓ స్మగ్లర్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా స్మగ్లర్లకు గాయాలైనప్పటికీ చీకట్లో తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు. ఆ సమయంలో స్మగ్లర్ల నుంచి 532 బాటిళ్ల పెన్సిడిల్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు..  మరణించిన స్మగ్లర్‌ ముర్షీదాబాద్‌కు చెందిన రోహిల్‌ మండల్‌గా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని